హైదరాబాద్: నగరంలోని సున్నం చెరువు సుందరీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. చెరువుల పరిరక్షణ, అభివృద్ధిపై దృష్టి సారించిన హైడ్రా.. సుమారు రూ.10 కోట్ల వ్యయంతో సున్నం చెరువును పునరుద్ధరిస్తోంది. చెరువు సుందరీకరణ పనులు పూర్తవుతుండటంతో రాత్రి వేళల్లో తీసిన డ్రోన్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
కబ్జాల నుంచి చెరువుకు విముక్తి
ఒకప్పుడు సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సున్నం చెరువు.. ఆక్రమణల కారణంగా 16 ఎకరాలకు కుదించుకుపోయింది. ఈ నేపథ్యంలో హైడ్రా ఆక్రమణలను తొలగించి, సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేస్తోంది. చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కమర్షియల్ షెడ్లను తొలగించిన అధికారులు, అక్కడి నివాస నిర్మాణాలను మాత్రం తొలగించలేదని స్థానికంగా చర్చ జరుగుతోంది.
బండ్, ఇన్లెట్ల నిర్మాణం
చెరువు చుట్టూ బండ్ నిర్మాణంతో పాటు రెండు ఇన్లెట్లను ఏర్పాటు చేస్తున్నారు. మురుగునీరు చెరువులోకి చేరకుండా డ్రైనేజీ ప్రవాహాన్ని మళ్లించి, వర్షపు నీరు మాత్రమే చెరువులోకి చేరేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తున్నారు. దీంతో చెరువు నీటి నాణ్యతను కాపాడటంతో పాటు వర్షపు నీటి నిల్వకు అవకాశం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
బోటింగ్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్
సున్నం చెరువును ఆహ్లాదకరమైన పర్యాటక, వినోద కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు చేపట్టారు. చెరువు మధ్యలో బోటింగ్ కోసం ఐలాండ్ను ఏర్పాటు చేస్తున్నారు. సందర్శకుల కోసం వాకింగ్ వే, ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం కిడ్స్ ప్లే ఏరియాను అభివృద్ధి చేస్తున్నారు. చెరువు పరిసరాల్లో పచ్చదనాన్ని పెంచి, ప్రజలు ప్రశాంతంగా గడిపేలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
నగరంలో భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువు ఎగువన ఉన్న కాలనీలకు వరద ముప్పు తగ్గించేలా అభివృద్ధి పనులను చేపడుతున్నారు. వర్షపు నీరు సహజ ప్రవాహ మార్గాల ద్వారా చెరువులోకి చేరేలా ప్రణాళిక రూపొందించారు. చెరువు పునరుద్ధరణతో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో వరద నిర్వహణకు తోడ్పాటు లభిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.
సుందరీకరణ పనులు పూర్తయితే సున్నం చెరువు స్థానికులకు ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారడంతో పాటు, చెరువు పరిరక్షణకు కూడా దోహదపడనుంది. ప్రస్తుతం చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు, రాత్రి వేళల్లో కనిపిస్తున్న దృశ్యాలు నగరవాసుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
