వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్(WIPO) విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2026 నివేదిక ప్రకారం.. ఆలోచనలను, పరిశోధనలను వాస్తవ ప్రపంచ సృష్టిగా మార్చడంలో వివిధ దేశాల ప్రతిభ బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా 139 ఆర్థిక వ్యవస్థలను విశ్లేషించి రూపొందించిన ఈ రిపోర్టులో స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా దేశాలు అగ్రస్థానాల్లో నిలిచాయి. సాంకేతికత, వ్యాపార నైపుణ్యాలు, పరిశోధనా సామర్థ్యాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ కేటాయించబడ్డాయి.
1. స్విట్జర్లాండ్:
66.7 పాయింట్లతో స్విట్జర్లాండ్ ఈ సూచీలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వరుసగా 16 సంవత్సరాలుగా నంబర్ 1 స్థానంలో కొనసాగుతూ తన ఇన్నోవేషన్ పవర్‌ను నిరూపించుకుంటోంది. పటిష్టమైన సంస్థలు, పరిశోధనా రంగాలు, వ్యాపార నైపుణ్యాలు దీనికి ప్రధాన కారణం.
2. స్వీడన్:
63.2 స్కోర్‌తో స్వీడన్ రెండో స్థానంలో నిలిచింది. యూరప్ దేశాల ఆధిపత్యాన్ని చాటుతూ రీసెర్చ్, టెక్నాలజీ రంగాల్లో ఈ దేశం అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ సూచీలోని టాప్ 25 దేశాల్లో 14 యూరప్‌కు చెందినవే కావడం విశేషం.
3. అమెరికా:
62.3 పాయింట్లతో అమెరికా 3వ స్థానంలో నిలిచింది అమెరికా. AI వెంచర్ క్యాపిటల్ పెట్టుబడుల్లో ఈ దేశం ప్రపంచంలోనే టాప్ గా ఉంది. 2026 మొదటి అర్ధభాగంలో ప్రపంచ AI వెంచర్ క్యాపిటల్ విలువలో ఉత్తర అమెరికా వాటా 86 శాతంగా ఉంది.
4. దక్షిణ కొరియా:
61.4 పాయింట్లతో దక్షిణ కొరియా 4వ స్థానంలో నిలిచింది. సింగపూర్, చైనా, జపాన్ దేశాలను వెనక్కి నెట్టి ఆసియా ఖండంలోనే అత్యధిక ర్యాంక్ సాధించిన దేశంగా గుర్తింపు పొందింది.
5. సింగపూర్:
61.0 పాయింట్లతో సింగపూర్ 5వ స్థానాన్ని దక్కించుకుంది. ఆసియాలో అత్యంత ప్రముఖ ఇన్నోవేషన్ కేంద్రాల్లో ఒకటిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
6. యునైటెడ్ కింగ్డమ్:
59.6 పాయింట్లతో యూకే 6వ స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్, ఫిన్లాండ్, డెన్మార్క్ వంటి దేశాలకంటే ముందు వరుసలో నిలిచి యూరప్ ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది.
7. నెదర్లాండ్స్:
58.4 పాయింట్లతో నెదర్లాండ్స్ 7వ స్థానాన్ని దక్కించుకుంది. యూరప్, ఉత్తర అమెరికా, ఆసియా దేశాల కలయికతో కూడిన టాప్-7 జాబితాను ఈ దేశం పూర్తి చేసింది.
ఇన్నోవేషన్ విషయంలో ఇండియా పరిస్థితి ఏంటి?
ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2026లో భారత్ 40.1 పాయింట్లతో 38వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టాప్-7లో లేనప్పటికీ.. 2013 నుంచి భారత్ అసాధారణ వృద్ధిని సాధించింది. ప్రత్యేకించి ఇన్నోవేషన్ ఇన్పుట్స్ (49వ స్థానం) కంటే ఔట్‌పుట్స్ (25వ స్థానం) పరంగా భారత్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. డిజిటల్ సేవలు, వెంచర్ క్యాపిటల్ మరియు ICT సేవల ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. అంతేకాకుండా.. తన అభివృద్ధి స్థాయికి మించి అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న 'ఇన్నోవేషన్ ఓవర్పెర్ఫార్మర్' దేశంగా భారత్ వరుసగా 16వ ఏడాది కూడా కొనసాగుతుండటం విశేషం.
