ఫ్లయింగ్ కార్లు వచ్చేస్తున్నాయ్.. ఎగిరే టెస్లా కారును ఆవిష్కరించిన ఎలాన్ మస్క్

ఫ్లయింగ్ కార్లు వచ్చేస్తున్నాయ్.. ఎగిరే టెస్లా కారును ఆవిష్కరించిన ఎలాన్ మస్క్

హైదరాబాద్: ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన ఎగిరే కార్లు ఇప్పుడు నిజ జీవితంలోనూ చూడబోతున్నాం.రోడ్లపై ప్రయాణించడంతో పాటు ఆకాశంలో ఎగిరే వాహనాల తయారీపై ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు భవిష్యత్తు రవాణా రంగంలో కీలక మార్పులు తీసుకురానున్నాయి.గురువారం టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ ఎగిరే కారును  ఆవిష్కరించారు. ఫ్లయింగ్ కారు రాకపై  మస్క్ షేర్ చేసిన  వీడియో  సోషల్ మీడియా వైరల్ అవుతోంది. 

ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టెస్లా నెక్ట్స్ జనరేషన్ రోడ్‌స్టర్ కారు గాల్లోకి ఎగిరి పల్టీలు కొడుతున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. దీంతో ఈ స్పోర్ట్స్ కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

అమెరికాలోని వాకోలో జరిగిన కార్యక్రమంలో ఈ కారును ప్రదర్శించారు. ఇందులో రోడ్‌స్టర్ కారు ఎత్తైన వంపు ఉన్న ర్యాంప్‌పైకి వెళ్లి, గాల్లో పల్టీ కొట్టి తిరిగి కిందకు దిగినట్లు చూపించారు. ఈ విన్యాసం కోసం కారు కింద ప్రత్యేక థ్రస్టర్లు అమర్చినట్లు వీడియోలో కనిపించింది. టెస్లా ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ లార్స్ మొరావీ ఈ విన్యాసాన్ని ‘కిక్ ఫ్లిప్’గా వర్ణించారు. 

ఈ కారు రాకెట్ తరహా టెక్నాలజీతో  విన్యాసాలు చేయగలదని మస్క్ చెప్పారు. కంప్రెస్డ్ ఎయిర్ ని ఉపయోగించే ప్రత్యేక వ్యవస్థ ద్వారా థ్రస్ట్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. వాహనంలో హై ప్రెజర్ ఎయిర్ ట్యాంకులు, గాలిని బయటకు విడుదల చేసే నాజిళ్లు ఉంటాయని వెల్లడించారు. రోడ్‌స్టర్ గంటకు 60 మైళ్ల వేగాన్ని ఒక సెకను కంటే తక్కువ సమయంలో అందుకుంటుందని టెస్లా పేర్కొంది. అయితే, ఈ వేగం సహా ప్రదర్శనలో చెప్పిన సామర్థ్యాలు ఉత్పత్తి వాహనంలో టెస్టింగ్ దశలో ఉన్నాయి.

ఈ కారును 2028లో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మస్క్ తెలిపారు. అయితే, ధర, మార్కెట్లోకి విడుదలయ్యే తేదీ వంటి వివరాలను ప్రకటించలేదు. గాల్లో విన్యాసాలు చేసే రోడ్‌స్టర్ నిజంగా కస్టమర్లు అందుబాటులోకి వస్తుందా అనేది వేచి చూడాలి.