- రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బి.మధుసూదన్ రెడ్డి ఎన్నిక
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భిక్షం గౌడ్ పేరు ఖరారు
హైదరాబాద్/నల్గొండ, వెలుగు: పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సుంకరి భిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బి.మధుసూదన్ రెడ్డి ఎన్నికయ్యారు. నల్లగొండలో 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల సందర్భంగా కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే 72,457 మంది ఆన్లైన్ సభ్యత్వంతో అతిపెద్ద సంఘంగా ఉన్న పీఆర్టీయూ నూతన నాయకత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార బాధ్యత ఉందన్నారు.
ఉద్యమ చరిత్ర కలిగిన సామాన్యుడు భిక్షం గౌడ్ రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థిగా బరిలో ఉంటారని ప్రకటించారు. అనంతరం భిక్షం గౌడ్ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగుల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేందుకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, పీఆర్టీయూ అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, నాయకులు జగన్మోహన్ గుప్తా, కోమటిరెడ్డి నరసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
