పీఎం కేర్స్ స్కాలర్‌షిప్ తీసుకునే పిల్లలకు అలర్ట్.. కేంద్రం కీలక ఆదేశాలు! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

పీఎం కేర్స్ స్కాలర్‌షిప్ తీసుకునే పిల్లలకు అలర్ట్..  కేంద్రం కీలక ఆదేశాలు! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్‌ కింద స్కాలర్‌షిప్ పొందుతున్న పిల్లలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈ పథకం ద్వారా అందించే విద్యా సహాయాన్ని పొందాలంటే ఆధార్ అతేంటికేషన్ చేయించుకోవాలని లేదా ఆధార్ నంబర్ ఉన్నట్లు ప్రూఫ్ చూపించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే పిల్లలకు విద్యను కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ ప్రయోజనాలు పొందే లబ్ధిదారులు వారి గుర్తింపును ధృవీకరించుకోవడం కోసం ఆధార్‌కు సంబంధించిన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఆధార్ లేకపోయినా స్కాలర్‌షిప్ ఆగదు!
ఆధార్ ధృవీకరణ విఫలమైనా లేదా పిల్లలకు ఇంకా ఆధార్ నంబర్ కేటాయించకపోయినా వారికి పథకం ప్రయోజనాలను నిరాకరించబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయ ప్రూఫ్స్  ద్వారా పిల్లల గుర్తింపును నిర్ధారిస్తారు. అలాగే, సంబంధిత పిల్లలకు వారి తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులతో ఉన్న సంబంధాన్ని కూడా ధృవీకరించిన తర్వాత పథకం ప్రయోజనాలు అందిస్తారు. ఆధార్ నంబర్ లేని కారణంగా పిల్లలకు విద్యా సహాయం అందకుండా పోకూడదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ గుర్తింపు ధృవీకరణకు అవకాశం కల్పించారు.

18 ఏళ్లలోపు పిల్లలు ఏ ప్రూఫ్స్ సమర్పించాలి?
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న లబ్ధిదారులు వారి గుర్తింపును నిరూపించుకోవడానికి కొన్ని ప్రూఫ్స్  సమర్పించవచ్చు. ఆధార్ రిజిస్టర్  చేసుకున్నట్లయితే, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఉన్న రిసిప్ట్ అందించాలి. దీంతోపాటు పిల్లల వయస్సును నిర్ధారించే బర్త్ సర్టిఫికెట్, ఇండియన్  పాస్‌పోర్ట్, పదో తరగతి లేదా పన్నెండో తరగతి మార్కుల మెమోలను ప్రూఫ్  కింద కూడా సమర్పించాల్సి ఉంటుంది. వీటి  ఆధారంగా పిల్లల గుర్తింపు, వయస్సును ధృవీకరిస్తారు.

ఆధార్ ధృవీకరణ విఫలమైతే ఏం చేస్తారు?
కొన్ని సందర్భాల్లో ఆధార్ వివరాలు మ్యాచ్ కాకపోవడం లేదా వెరిఫికేషన్ లో సమస్యలు రావడం వల్ల ఆధార్ ధృవీకరణ పూర్తికాకపోవచ్చు. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ ధృవీకరణ పద్ధతులను అనుసరించేందుకు నోటిఫికేషన్‌లో అవకాశం కల్పించారు.
అవసరాన్ని బట్టి బయోమెట్రిక్ ధృవీకరణ లేదా వన్‌టైమ్ పాస్‌వర్డ్ (OTP)   ధృవీకరణ వంటి పద్ధతులను ఉపయోగించవచ్చు. వీటితోపాటు నోటిఫికేషన్‌లో సూచించిన ఇతర ప్రూఫ్స్ ఆధారంగా కూడా లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తారు.

 పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద విద్యా సహాయం పొందుతున్న పిల్లల వివరాలను ధృవీకరించేందుకు కేంద్రం ఈ నిబంధనలను తీసుకొచ్చింది.