చక్కెర ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న కోట్లాది మందికి ఇది గుడ్ న్యూస్. ఇథనాల్ తయారీకి చక్కెర వాడకంపై కేంద్ర బ్యాన్ విధించింది. దీంతో దేశ వ్యాప్తంగా షుగర్ ప్రైస్ కంట్రోల్ లోకి రానున్నాయి. చక్కెరతో పాటు చెరుకు రసం, షుగర్ సిరప్, బీ-హెవీ మొలాసిస్ వాడకాన్ని నిషేధించింది.
ఇథనాల్ తయారీలో భాగంగా 2026-27 లో చక్కెర సంబంధిత పదార్థాల వినియోగాన్ని బ్యాన్ చేస్తూ లేటెస్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా చక్కెర ధరల పెరుగుదల ఆందోళనలతో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ధరలు కంట్రలో చేస్తూ గృహ అవసరాలకు చక్కెర అందుబాటులో ఉంచేక్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇథనాల్ ప్రొడక్షన్ పై కొత్త ఆదేశాలు:
రాయిటర్స్ నివేదిక ప్రకారం, నవంబర్ 2026లో ప్రారంభమయ్యే సప్లై ఇయర్ కు.. కంపెనీలు బిడ్లను ఆహ్వానించాయి. మొత్తం 1,100 కోట్ల లీటర్ల ఇథనాల్ను సేకరించేందుకు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంతో సహా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ఒక టెండర్ ద్వారా బిడ్లను ఆహ్వానించాయి. చెరకు రసం, చక్కెర సిరప్, బి-హెవీ మొలాసిస్తో సహా చక్కెర ఆధారిత ఫీడ్స్టాక్లను లేటెస్టుగా టెండర్ నుంచి మినహాయించారు.
సవరించిన ఒప్పందం ప్రకారం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) సేకరించిన మొక్కజొన్న, నూకలు , మిగులు బియ్యం నుంచి తయారు చేసిన ఇంధనాన్ని సరఫరా చేయడానికి ఇథనాల్ ఉత్పత్తిదారులు బిడ్ వేయవచ్చు. ప్రభుత్వం దేశీయ చక్కెర నిల్వలను పరిరక్షించాలని చూస్తున్న క్రమంలో, ఇది గ్రెయిన్ బేస్డ్ ( ధాన్యం ఆధారిత ) ఇథనాల్ ఉత్పత్తి వైపు కంపెనీలు మరలేలా ఈ ఉత్తర్వులు వచ్చాయని భావిస్తున్నారు.
ఎందుకు ఈ పరిమితులు:
చక్కెర లభ్యత తగ్గిపోవడం, పెరుగుతున్న ధరలపై ఉన్న ఆందోళనలే ఈ నిర్ణయం వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదవ్వడం వల్ల ఆ రెండు రాష్ట్రాల్లో చెరకు ఉత్పత్తిపై ఆందోళనలు పెరిగాయి. ఉత్పత్తిలో ఏ మాత్రం తగ్గుదల కనిపించినా, అది చక్కెర సరఫరా, ధరలపై మరింత ఒత్తిడిని పెంచవచ్చు.
