ఎలాన్ మస్క్, రిలయన్స్ మధ్య కొన్ని రోజులుగా నడిచిన వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. భారతీయ రెగ్యులేటరీ వ్యవస్థపై మస్క్ చేసిన ఆరోపణలపై రిలయన్స్ సంస్థ స్పందించింది. తమ వృద్ధి చట్టాలకు లోబడి ఉండే విదేశీ, దేశీయ పెట్టుబడులను స్వాగతించే భారతీయ మార్కెట్ ఆధారంగానే సాగిందని స్పష్టం చేసింది. అంతేకాకుండా రిలయన్స్ జియో శాటిలైట్ సేవలకు కూడా ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉందని, తాము ఎప్పుడూ పోటీకి భయపడలేదని రిలయన్స్ కుండబద్దలు కొట్టింది. భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న జియో, వన్‌వెబ్, స్టార్‌లింక్ అన్నీ ప్రస్తుతం ఒకే దశలో, రెగ్యులేటరీ అప్రూవల్స్ కోసమే ఎదురుచూస్తున్నాయని గుర్తుచేసింది.
రిలయన్స్ నుంచి ఈ స్పష్టమైన ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత్‌లో గత 5 ఏళ్లుగా రెగ్యులేటర్లు, ఆపరేటర్లతో కలిసి పనిచేశామని, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశామని స్టార్‌లింక్ ఎక్స్ వేదికగా రాజీ ధోరణితో ఓ ప్రకటన విడుదల చేసింది. "భారత్‌ను హై-స్పీడ్ ఇంటర్నెట్తో అనుసంధానించడానికి స్టార్‌లింక్ సిద్ధంగా ఉంది" అంటూ అందులో పేర్కొంది.
@RIL_Updates Much appreciated
— Elon Musk (@elonmusk) October 16, 2026
స్టార్‌లింక్ చేసిన ఈ సయోధ్య ప్రకటనపై ఎలాన్ మస్క్ వెంటనే స్పందించారు. రిలయన్స్, స్టార్‌లింక్ పరిణామాలపై స్పందిస్తూ " అప్రిషియేట్ చేస్తున్నాను" (much appreciated) అంటూ రిప్లై ఇవ్వడం గమనార్హం. భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్ దక్కించుకోవడానికి తీవ్ర పోటీ నడుస్తున్న తరుణంలో.. ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రిలయన్స్ గట్టిగా బదులివ్వడంతోనే స్టార్‌లింక్, ఎలాన్ మస్క్ స్వరం మార్చి కాంప్రమైజ్ అయ్యారనే చర్చ జోరుగా నడుస్తోంది నెట్టింట.
We have worked closely with regulators, industry and operators in India for 5+ years, and built a network of dedicated systems, gateways, and other infrastructure all in-country to exclusively serve Indian traffic safely and securely - and all with the requisite government approvals. Starlink is ready to connect India with high-speed internet.
— Starlink (@Starlink) October 16, 2026
