మాజీ సీఎం కోసం 9 మందిని హత్య చేయించా: జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మాజీ సీఎం  కోసం 9 మందిని హత్య చేయించా: జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ చేసిన వ్యాఖ్యలు బీహార్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కోసం తొమ్మిది మందిని హత్య చేయించానని చెప్పడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా భగ్గుమంది. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అధికార జేడీయూ కూటమిని ఇరకాటంలో పడేశాయి. అదేసమయంలో ప్రతిపక్ష ఆర్జేడీ సహా ఇతర పార్టీలకు కొత్త అస్త్రాన్ని ఇచ్చినట్లయింది. 

శాసన మండలి ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యర్థి నీరజ్ కుమార్‌ను జేడీయూ అభ్యర్థిగా ప్రకటించినందుకు అనంత్ సింగ్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  నితీశ్ కుమార్, నేను చాలా కాలం నుంచి కలిసి ఉన్నాం. ఆయన కోసం  నేను తొమ్మిది మందిని హత్య చేయించాను. ఆయనకు రాజకీయంగా పట్టుసాధించలేని పరిస్థితుల్లో  నేను ఆయన అండగా నిలిచాను అని అనంత్ సింగ్ అన్నారు.  

ఈ వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) తీవ్రంగా స్పందించింది. అనంత్ సింగ్ మాటలు రాజకీయ నేరాలను ఒప్పుకోవడమేనని ఆర్‌జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ అన్నారు. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన హత్యలకు సంబంధించి సదరు ఎమ్మెల్యే ఈ విషయాలు వెల్లడించి ఉండవచ్చునని అంటున్నారు.  నితీశ్ కుమార్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల గ్యాంగ్ స్టర్లతో చేతులు కలిపి అధికారం సాధించారని  ఆరోపించారు.  

అయితే జేడీయూ మాత్రం అనంత్ సింగ్ వ్యాఖ్యలపై ఆచితూచి స్పందిస్తోంది. దాదాపుగా ఆ వ్యవహారాన్ని అవాయిడ్  చేసేందుకు ప్రయత్నిస్తోంది.  పార్టీ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ మాట్లాడుతూ  ఈ వ్యాఖ్యలను పార్టీ సీరియస్ గా తీసుకోనవసరం లేదు. నితీశ్ కుమార్ ఎలాంటి నేరాలు, హింసతో సంబంధం లేకుండా స్వచ్ఛమైన చరిత్ర కలిగిన వ్యక్తి అని  అన్నారు.  

అయితే రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతుండటంతో  అనంత్ సింగ్ తన వ్యాఖ్యలపై మాట మార్చారు. నీరజ్ కుమార్‌కు సమాధానం చెప్పాను. నేను చేసిన త్యాగాలు చెప్పాను. లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో నా తొమ్మిది మంది అనుచరులు హత్యకు గురయ్యారు. నన్ను కూడా కాల్చారు. నితీశ్ కుమార్‌తో చేరినందుకే లాలూ యాదవ్ వారిని చంపించారు. మా నష్టాలు చాలా ఎక్కువ. నా తండ్రి కూడా గుండెపోటుతో మరణించారు  అని చెప్పుకొచ్చారు.

బీహార్ శాసన మండలికి ఎనిమిది సీట్లకు అక్టోబర్ 23న  ఎన్నికలు  జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 27న జరుగుతుంది. ఈ క్రమంలో బీహార్ లో కొత్త  రాజకీయ వివాదం మొదలైంది.