రోజూ ప్రజలు తమ పనులకు వెళ్లేందుకు సహజంగా బైక్ ట్యాక్సీ రైడ్స్ బుక్ చేసుకోవటం సిటీల్లో సర్వ సాధారణం. అయితే బెంగళూరులో జరిగిన ఒక ఘటన ప్రయాణికుల భద్రతపై తీవ్రమైన చర్చకు దారితీసింది. 'ర్యాపిడో పింక్' రైడ్‌ను ఆశ్రయించిన ఓ యువతికి రైడర్ కారణంగా తీవ్రమైన అసౌకర్యం, భయానక అనుభవం ఎదురైంది. సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్న ఈ వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
శ్రీష్టి అనే యువతి అక్టోబర్ 15న ర్యాపిడో బుక్ చేసుకోగా.. భారీ వర్షం కారణంగా ఆమె రైడ్‌ను రద్దు చేసుకోవాలనుకున్నారు. అయితే రైడర్ సయ్యద్ తౌసిఫ్జెడ్ అనే ర్యాపిడో కెప్టెన్ వర్షం కారణంగా రైడ్ రద్దు చేయవద్దని పదే పదే రిక్వెస్ట్ చేయటంతో ఆమె ప్రయాణానికి అంగీకరించారు.
ప్రయాణ సమయంలో రైడర్ వ్యవహారశైలి ఆమెను మరింత అభద్రతాభావుకు గురిచేసింది. చెవులకు ఇయర్‌ఫోన్స్ ఉన్నప్పటికీ.. అతను పదే పదే సౌకర్యంగా ఉందా అని అడుగుతూ ఓవర్-ఫ్రెండ్లీగా ప్రవర్తించాడట. ఇక్కడితో ఆగకుండా.. ఆమె ఇంటి డెస్టినేషన్ పాయింట్ చేరుకున్నాక హెల్మెట్ తిరిగి ఇస్తున్న సమయంలో ఆమె చేతిని బలవంతంగా కొన్ని సెకన్ల పాటు పట్టుకున్నాడు. అంతేకాకుండా వర్షం కారణంగా ఫోన్ పనిచేయడం లేదంటూ ఆమె ఫోన్ నంబర్ అడిగాడు. ఆమె నంబర్ చెప్పేందుకు నిరాకరించి తన ఫోన్ ద్వారానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేశారు.
When I took the ride, he tried to be over-friendly by offering me raincoat and asking me 4 times “Are you Comfortable” when my earphones were plugged in. Dropped me Near my Society and while giving his helmet back- HE FUCKING HELD MY HAND FOR SECONDS while CREEPILY SMILING AT ME
— swishbee (@srishhteaaaa) October 15, 2026
రైడర్ చేయిపట్టుకోవటంతో ఒక్కసారిగా షాక్ అయిన శ్రీష్టి భయంతో వెంటనే లోపలికి వెళ్లకుండా దాదాపు 15 నిమిషాలపాటు గేటు బయటే ఉండిపోయింది. ఆ సమయంలోనూ రైడర్ అక్కడే తచ్చాడుతుండటంతో, సెక్యూరిటీ గార్డ్ సహాయంతో అతన్ని అక్కడి నుంచి పంపించాల్సి వచ్చింది. తనకు ఈ దురదృష్టకర అనుభవాన్ని శ్రీష్టి ఎక్స్ వేదికగా పంచుకుంటూ.. మహిళా ప్రయాణికుల భద్రతపై ర్యాపిడో సంస్థకు ఉన్న బాధ్యత ఏమిటని ప్రశ్నించారు. బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పోస్ట్‌పై స్పందించిన బెంగళూరు పోలీసులు, ర్యాపిడో సంస్థ తక్షణ చర్యలు చేపట్టాయి. మహిళల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ర్యాపిడో స్పష్టం చేసింది. ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేసే ఎలాంటి అనుచిత ప్రవర్తననైనా సహించేది లేదని తెలిపింది. బాధితురాలికి క్షమాపణలు చెప్పిన కంపెనీ.. దిద్దుబాటు చర్యల్లో భాగంగా వెంటనే ఆ రైడర్‌ను శాశ్వతంగా సస్పెండ్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ బైక్ ట్యాక్సీల విషయంలో మహిళల సేఫ్టీకి మరింత జాగ్రత్తలు అవసరమని తాజా బెంగళూరు ఘటన నిరూపిస్తోంది.
