బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్కు ముంబై అధికారులు షాక్ ఇచ్చారు. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఆయన బంగ్లాలోని కొన్ని భాగాన్నీ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు కూల్చివేశారు. అనుమతులు లేకుండా నిర్మాణ పనులు చేపట్టినట్లు గుర్తించిన అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. పనులు నిలిపివేయాలని నోటీసులు జారీ చేసిన కొద్ది రోజులకే కూల్చివేత చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు
అజయ్ దేవ్గన్కు చెందిన ఈ బంగ్లా ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న కపోలే సహకార గృహ సముదాయంలో ఉంది. ఈ బంగ్లా మొత్తం 7,802 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం.
బీఎంసీ అధికారుల ప్రకారం.. బంగ్లాలో మున్సిపల్ అనుమతులు తీసుకోకుండానే కొన్ని మార్పులు చేపట్టారు. బంగ్లా లోపల నిర్మాణాల్లో మార్పులు చేయడం, విభజన గోడలు నిర్మించడం, కిటికీలను మార్చడం సహా ఇతర పనులు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 354A కింద బీఎంసీ అధికారులు నోటీసు జారీ చేశారు. వెంటనే నిర్మాణ పనులను నిలిపివేయాలని, చేపట్టిన పనులకు సంబంధించిన సరైన పేపర్స్ సబ్మిట్ చేయాలనీ ఆదేశించారు.
నోటీసులు ఇచ్చినా ఆగని పనులు
బీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్మాణ పనులు కొనసాగినట్లు సమాచారం. దీంతో అధికారులు రంగంలోకి దిగి, నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాల్లోని కొన్ని భాగాలను కూల్చివేశారు. అధికారులు సుత్తులతో నిర్మాణాలను తొలగిస్తున్న దృశ్యాలు కూడా నెట్టింట్లో కనిపించాయి.
విమల్ ప్రకటనతో మరో వివాదం
ఇదిలా ఉండగా, అజయ్ దేవ్గన్ మరో వివాదంలోనూ చిక్కుకున్నారు. 'విమల్ ఏలకుల' (Vimal Elaichi) ప్రకటనలో నటించినందుకు ఆయనతో పాటు బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ ప్రకటనలో చూపించిన ఉత్పత్తి, నిషేధిత ఉత్పత్తికి పరోక్షంగా ప్రచారం కల్పించే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో అధికారులు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మహారాష్ట్ర ఎఫ్డీఏ చీఫ్ తుకారాం ముండే వెల్లడించారు.
‘దృశ్యం’ విజయంతో జోరుమీదున్న అజయ్ దేవ్గన్
మరోవైపు, అజయ్ దేవ్గన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’ చివరి భాగం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల వసూళ్ల క్లబ్లో చేరినట్లు సమాచారం. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ మూడో, చివరి భాగం అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. సినిమాలోని నటన, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, ఊహించని మలుపులకు విమర్శకుల నుంచి ఎక్కువగా సానుకూల స్పందన లభించింది. ఒకవైపు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న అజయ్ దేవ్గన్.. మరోవైపు బంగ్లా నిర్మాణం, ప్రకటనకు సంబంధించిన వివాదాలతో వార్తల్లో నిలిచారు.
