- కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ ఫైర్
లక్నో: బంగ్లాదేశ్ తరహాలో భారత్లోనూ ప్రభుత్వాన్ని మార్చాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. యువత శక్తిని అరాచకానికి, రాజకీయ ఘర్షణలకు వాడుకుంటున్నారని విమర్శించారు.
శుక్రవారం ఆయన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో మీడియాతో మాట్లాడారు. దేశంలో అల్లర్లు సృష్టించడానికి ప్రజాస్వామ్యం ఎవరికీ లైసెన్స్ ఇవ్వదని రాజ్నాథ్ స్పష్టంచేశారు. దేశంలో రాజకీయ ఘర్షణల కోసమే ఢిల్లీలో యువత చేస్తున్న నిరసనలను కాంగ్రెస్, మిత్రపక్షాలు రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. యువతకు నిర్మాణాత్మక మార్గదర్శకత్వం చేయాల్సిందిపోయి.. దేశంలో అశాంతిని నెలకొల్పేందుకు ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు.
బంగ్లాదేశ్ తరహా మార్పు కోసం తాము స్ఫూర్తి పొందుతున్నామని వారే బహిరంగంగా అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పోరాటం సంస్కరణల కోసం కాదని.. దేశంలో అస్థిరత సృష్టించి అధికారం చేజిక్కించుకోవడానికేనన్నారు. రాహుల్ గాంధీ తన రాజకీయ వ్యూహంపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ సంస్థలను బలిపెట్టబోమని తేల్చిచెప్పారు.
మోదీ నాయకత్వంలోనే దేశ ప్రతిష్ట పెరిగింది
మోదీ నాయకత్వంలో ప్రపంచ వేదికపై దేశ కీర్తిప్రతిష్టలు గణనీయంగా పెరిగాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుత భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. డిజిటల్ లావాదేవీల్లో అగ్రగామిగా నిలిచిందని, అంతరిక్షంలో కొత్త మైలురాళ్లు సాధించిందని తెలిపారు.
భారత్ 25కి పైగా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని.. ప్రధాని మోదీ 35 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారని వివరించారు. దేశ కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతుంటే.. కాంగ్రెస్ మాత్రం ఆ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తోందన్నారు.
