రూబియో టూర్ పై రాహుల్ వ్యంగ్యం..విదేశాంగశాఖ అధికారుల్లో గందరగోళం నెలకొందని ఎద్దేవా

రూబియో టూర్ పై రాహుల్ వ్యంగ్యం..విదేశాంగశాఖ అధికారుల్లో గందరగోళం నెలకొందని ఎద్దేవా
  •   ఢిల్లీ బయట ఆతిథ్యం ఇవ్వడం సాధారణమేనన్న ప్రభుత్వం

న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. రూబియో టూర్‌‌‌‌‌‌‌‌పై భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) అధికారులకే ఎలాంటి స్పష్టత లేదని.. అసలు ఏం జరుగుతుందో అర్థంకాక ఆఫీసర్లంతా గందరగోళానికి గురవుతున్నారని సెటైర్లు వేశారు. 

శుక్రవారం రాహుల్.. విదేశాంగ మంత్రి జైశంకర్‌‌‌‌‌‌‌‌ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘రూబియో తన సిబ్బందిని (జైశంకర్‌‌‌‌‌‌‌‌ను) ముంబైకి రావాలని ఆదేశించారు. మోదీజీ.. అసలు ఏం జరుగుతుందో విదేశాంగ శాఖలోని మీ అధికారులకు అర్థంకాక గందరగోళానికి గురవుతున్నారు. 

విషయమేంటో బహుశా మీరే వారికి వివరించాలేమో..! ఒకవేళ మీకు వీలుకాకపోతే.. విషయం నన్ను చెప్పమన్నా సరే చెప్పడానికి సిద్ధమే..!’ అంటూ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.

అనవసర రాద్ధాంతం వద్దు

మార్కో రుబియో ముంబై పర్యటనపై రాహుల్ చేసిన విమర్శలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ బదులిచ్చింది. ఢిల్లీ కాకుండా దేశంలోని ఇతర నగరాల్లో విదేశీ ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వడం సాధారణ ఆనవాయీతేనని స్పష్టం చేసింది. 

ప్రధాని మోదీ గతంలో స్పానిష్ ప్రధానిని వడోదరలో, జర్మన్ ఛాన్సలర్‌‌‌‌‌‌‌‌ను అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో, అలాగే మారిషస్ ప్రధానిని వారణాసిలో స్వాగతించిన ఉదాహరణలను గుర్తుచేసింది. విదేశీ అతిథులను వేరే నగరాల్లో కలవడంపై అనవసర రాద్ధాంతం చేయవద్దని.. ఇది కేవలం దౌత్యపరమైన సంప్రదాయంలో భాగమేనని తేల్చిచెప్పింది.

ఎంఈఏ షెడ్యూల్ ప్రకారం.. విదేశాంగ మంత్రి జైశంకర్  ఈ నెల19, 20 తేదీల్లో అధికారిక పర్యటన నిమిత్తం రానున్న యూఏఈ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రికి ఆతిథ్యం ఇవ్వనున్నారు. అలాగే, ఈ నెల20న మార్కో రుబియాతో కూడా ఆయన అధికారికంగా చర్చలు జరపనున్నారు.