మూడు నెలల్లో ‘రోహిత్ వేముల చట్టం’ ముసాయిదా.. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

మూడు నెలల్లో ‘రోహిత్ వేముల చట్టం’ ముసాయిదా.. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
  • వర్సిటీల్లో కుల వివక్ష నిర్మూలనే లక్ష్యమని వెల్లడి
  • నల్సార్‌‌‌‌ న్యాయ వర్సిటీ సహకారంతో ఎస్సీడీడీ ఆధ్వర్యంలో కమిటీ 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షకు తావులేకుండా విద్యార్థుల హక్కులను పరిరక్షించేందుకు ‘రోహిత్ వేముల తెలంగాణ బిల్లు’ ప్రాథమిక ముసాయిదాను మూడు నెలల్లోగా సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రోహిత్ వేముల బిల్లుపై ఏర్పాటైన కేబినెట్‌‌‌‌ సబ్‌‌‌‌ కమిటీ రెండో సమావేశం జరిగింది.

సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్‌‌‌‌, అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రతిపాదిత చట్ట రూపకల్పనకు నిర్దేశిత కాలపరిమితిని అధికారులు పాటించాలన్నారు. మూడు నెలల్లోగా డ్రాఫ్ట్‌‌‌‌ పూర్తి చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపించాలని స్పష్టం చేశారు. ఈ చట్ట రూపకల్పనకు షెడ్యూల్డ్‌‌‌‌ కులాల అభివృద్ధి శాఖ నాయకత్వం వహిస్తుందని, తక్షణమే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ముసాయిదా పనులను ప్రారంభించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తయ్యేలా సంబంధిత శాఖలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాలన్నారు.

న్యాయశాఖను ప్రధాన సభ్య శాఖగా చేర్చాలి..

ప్రతిపాదిత బిల్లు రూపకల్పన ప్రక్రియలో ఎస్‌‌‌‌సీడీడీ శాఖతోపాటు న్యాయశాఖను ప్రధాన సభ్య శాఖగా చేర్చాలని, విద్యాశాఖ, హోంశాఖ వంటి విభాగాల భాగస్వామ్యాన్ని పరిశీలించాలని సబ్‌‌‌‌ కమిటీ నిర్ణయించింది. న్యాయపరంగా పక్కాగా, సమగ్రంగా ఉండేందుకు నల్సార్‌‌‌‌ న్యాయ విశ్వవిద్యాలయం సాంకేతిక, న్యాయ నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని తీర్మానించారు. నిబంధనల తయారీలో తోడ్పాటు అందించేందుకు నల్సార్‌‌‌‌ వర్సిటీ ఇప్పటికే అంగీకరించిందని ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి సమావేశంలో వెల్లడించారు.

చట్టంలోని నిబంధనలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఆచరణ సాధ్యంగా ఉండేలా పటిష్టమైన కార్యాచరణ యంత్రాంగాన్ని ముసాయిదాలోనే పొందుపరచాలని సబ్‌‌‌‌ కమిటీ స్పష్టం చేసింది.  సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌‌‌‌, సీనియర్‌‌‌‌ ఐపీఎస్‌‌‌‌ అధికారి డీఎస్‌‌‌‌ చౌహాన్‌‌‌‌, ప్రముఖ న్యాయవాది దిశా వాడేకర్‌‌‌‌ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.