- నేటి సాయంత్రం 4 గంటల వరకే చాన్స్: కాళోజీ వర్సిటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 2026-–27 విద్యాసంవత్సరానికి సంబంధించి మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ వర్సిటీ మాప్-( మిగిలిపోయిన సీట్ల భర్తీ)అప్ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫైనల్ మెరిట్ లిస్టులో పేర్లున్న అర్హులైన విద్యార్థులు నేటి(శనివారం)సాయంత్రం 4 గంటల వరకు tspvtmedadm.tsche.in వెబ్సైట్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
మొదటి విడతలో ఆప్షన్లు ఇవ్వనివారు, గత రౌండ్లలో సీటొచ్చినా కాలేజీల్లో చేరని లేదా సీట్లు వదులుకున్నవారు, కన్వీనర్ కోటా మాప్-అప్లో సీటు దక్కినవారు, ఎంసీసీ 3వ రౌండ్ వరకు అడ్మిషన్ పొందిన అభ్యర్థులు ఈ మాప్-అప్కు అనర్హులని వర్సిటీ స్పష్టం చేసింది.ఈ విడతలో సీటు అలాట్ అయ్యాక కాలేజీలో చేరకపోయినా, కోర్సును మధ్యలో వదిలేసినా రూ.20 లక్షల పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని, అంతేకాకుండా మూడేండ్ల పాటు ప్రవేశాల నుంచి డిబార్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు, సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ లో సీట్లు దక్కినా కాలేజీల్లో రిపోర్ట్ చేయని, అలాగే.. ఫ్రీ ఎగ్జిట్ ద్వారా తప్పుకున్న మొత్తం 304 మంది అభ్యర్థుల లిస్టుతో పాటు, ఫేజ్-3 తర్వాతి ఖాళీల సీట్ మ్యాట్రిక్స్ ను కూడా వర్సిటీ విడుదల చేసింది. రాష్ట్రంలోని 28 ప్రైవేట్ మెడికల్, 11 డెంటల్ కాలేజీల్లో లోకల్, అన్రిజర్వ్డ్, ఎన్ఆర్ఐ విభాగాల్లో ఉన్న ఖాళీలను ఈ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. అలాట్మెంట్ పొందిన అభ్యర్థులు యూనివర్సిటీ ఫీజుగా ఎంబీబీఎస్ బి-–కేటగిరీకి రూ.లక్ష, ఎన్ఆర్ఐకి రూ.2 లక్షలు, బీడీఎస్కు వరుసగా రూ.40 వేలు, రూ.80 వేలు ఆన్లైన్ లో చెల్లించి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని, ఒరిజినల్ సర్టిఫికెట్లతో నిర్ణీత గడువులోగా కాలేజీ ప్రిన్సిపాల్కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
