దసరా ఎఫెక్ట్‌: హైదరాబాద్‌–విజయవాడ నేషనల్ హైవేపై 4 కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్‌

దసరా ఎఫెక్ట్‌: హైదరాబాద్‌–విజయవాడ నేషనల్ హైవేపై 4 కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌: దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల పరిధిలోని కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్‌ వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జాతీయ రహదారిపై ప్రమాదాలకు ఆస్కారమున్న 17 బ్లాక్‌ స్పాట్లను గుర్తించి అక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ పనులు కొనసాగుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పండుగ నేపథ్యంలో వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్‌ సమస్య మరింత తీవ్రమైంది.

ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. లక్కారం నుంచి అంకిరెడ్డిగూడెం మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. మరోవైపు పంతంగి టోల్‌ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ పెరిగింది. దీంతో విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం తొమ్మిది టోల్‌ బూత్‌లను తెరిచి టోల్‌ సిబ్బంది వాహనాలను పంపిస్తున్నారు.

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు, ఇతర వాహనదారులు ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు సాగించాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లే వాహనదారులు ట్రాఫిక్‌ సిబ్బంది సూచనలను పాటించాలని కోరుతున్నారు.