- 2003 జీవో ప్రకారమే ప్రత్యేక బస్సుల చార్జీలు
- మాజీ మంత్రి పోస్టుపై టీజీఎస్ ఆర్టీసీ క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: పండుగల వేళ ఆర్టీసీ బస్సుల నిర్వహణ, మహాలక్ష్మి స్కీమ్ అమలుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు చేసిన ఆరోపణలను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. టికెట్ ధరల పెంపు, సర్వీసుల రద్దుపై ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేస్తూ ఆదివారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పండుగ రద్దీకి అనుగుణంగా టికెట్ల ధరల నిర్ణయం నిబంధనల ప్రకారమే జరుగుతోందని ఆర్టీసీ తెలిపింది. 2003 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగానే చార్జీల నియంత్రణ కొనసాగుతోందని, ప్రజలపై ఎలాంటి అదనపు భారం మోపలేదని చెప్పింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. దసరా వేళ బస్సు సర్వీసులను తగ్గించారన్న ఆరోపణలను కొట్టిపారేస్తూ, ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లేందుకు వీలుగా ఈసారి 7వేల అదనపు బస్సులను ఏర్పాటు చేశామని స్పష్టం చేసింది.
ఈ నెల 10వ తేదీ నుంచి ఇప్పటివరకు కేటాయించిన ప్రత్యేక బస్సుల్లో 97 శాతం సర్వీసులను విజయవంతంగా నడిపి, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామని వివరించింది. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ రద్దీని నియంత్రిస్తున్నారని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే మహాలక్ష్మి స్కీమ్ విజయవంతంగా అమలవుతోందని ఆర్టీసీ వెల్లడించింది.
