కోటగిరి,వెలుగు : నిజామాబాద్ జిల్లా కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతంగల్ మండల కేంద్రంలో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి భారీగా నగదును స్వాధీనం చేసుకుని పలువురిపై కేసు నమోదు చేశారు.
కోటగిరి ఎస్సై శ్రీనివాస్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం నిజామాబాద్ సీపీ ఆదేశాల మేరకు కోటగిరి పోలీసులు మూడుప్రత్యేక బృందాలుగా ఏర్పడి సుమారు 10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
రూ.74 .50 లక్షల నగదుతో పాటు పలు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆరుగురిపై చీటింగ్, మనీ లాండరింగ్ చట్టానికి సంబంధించిన కేసులు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
