కోల్‌‌‌‌‌‌‌‌కతా తొక్కిసలాట ఘటనలో ఏడుగురు అరెస్ట్

కోల్‌‌‌‌‌‌‌‌కతా తొక్కిసలాట ఘటనలో ఏడుగురు అరెస్ట్

కోల్​కతా: బెంగాల్ రాజధాని కోల్‌‌‌‌‌‌‌‌కతాలోని చోర్బాగాన్ దుర్గా మండపం వద్ద శనివారం జరిగిన తొక్కిసలాటలో 19 మంది మృతి చెందగా, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు.. నిర్వాహకులతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. పూజా కమిటీ కార్యదర్శి రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్ సెవ్డా, ఉపాధ్యక్షుడు, సెక్యూరిటీ కమిటీ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ప్రమాదం నేపథ్యంలో చోర్బాగాన్ దుర్గా మండపాన్ని మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే భద్రతా చర్యల్లో భాగంగా సిటీలోని ఇతర ప్రముఖ పూజా మండపాలనూ కూడా తాత్కాలికంగా క్లోజ్​చేయాలని పోలీసులు ఆదేశించారు.

అసలేం జరిగిందంటే..

దుర్గాపూజలో ఏడో రోజైన సప్తమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆ సమయంలో భారీ వర్షం కురవడంతో పలువురు మండపం ఎంట్రీ గేట్ల వైపు పరుగులు తీశారు. ఇరుకైన వీధిలో ఒక్కసారిగా రద్దీ పెరగడంతో భక్తులు ఒకరినొకరు తోసుకున్నారు. ఈక్రమంలోనే కొందరు కిందపడటంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.

మండపం కూలిపోతుంది.. వెళ్లిపోండి

‘మండపం పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇది కూలిపోతుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ నిర్వాహకులు మైక్రోఫోన్ ద్వారా హెచ్చరించడంతో భక్తులు భయందోళనకు గురయ్యారు. రద్దీ నియంత్రణకు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో పాటు.. లౌడ్​స్పీకర్‎లో తికమక పెట్టే ప్రకటనలే తొక్కిసలాటకు దారి తీసి ఉంటాయని పోలీసులు చెప్పారు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తునకు కలకత్తా హైకోర్టుకు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్), ఫ్యాక్ట్-ఫైండింగ్ కమిటీని బెంగాల్​ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ప్రభుత్వం ఉద్యోగం..

కోల్‌‌‌‌‌‌‌‌కతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌  (ఎంసీహెచ్​)లో చికిత్స పొందుతున్న 25 మంది బాధితులను కేంద్ర హోం మంత్రి అమిత్​షా, బెంగాల్ సీఎం సువేందు అధికారి పరామర్శించారు. మృతుల కుటుంబాలలో ఒకరికి సర్కార్ ఉద్యోగంతో పాటు రూ.25 లక్షల పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారికి అయ్యే పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.