- చైనా ఏజెంట్లకు కీలక సమాచారం చేరవేత
శ్రీనగర్: దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం విదేశీ గూఢచారుల చేతికి చిక్కిన వైనం కలకలం రేపింది. కొందరు చైనా గూఢచారులు పన్నిన కుట్రలో ఓ సీనియర్ ఆర్మీ అధికారి భార్య చిక్కుకున్నారు. ఆమె నుంచి రక్షణ రంగానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఆ ఏజెంట్లు సేకరించినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
జమ్మూలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితురాలు నివాసం ఉంటున్నారు. ఆమె భర్త సైన్యంలో సీనియర్ అధికారిగా సేవలందిస్తున్నారు. ఈ ఘటనపై జమ్మూలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చైనా గూఢచారులు మేధావులు, విద్యావేత్తల ముసుగులో ఆ మహిళను సంప్రదించారు. మొదట పర్యావరణం, భౌగోళిక అంశాలపై ఆర్టికల్స్, వ్యాసాలు రాయాలని ఆమెను కోరారు.
క్రమక్రమంగా వ్యూహాత్మకంగా రక్షణ రంగానికి సంబంధించిన సున్నితమైన విషయాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎదురుగా ఉన్నది విదేశీ గూఢచారులని ఆమె గుర్తించలేకపోయారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణంలో లోతుగా విచారణ చేస్తున్నారు.
