మధ్యప్రదేశ్‎లోని గ్వాలియర్‌‌‌‌‌‌‌‌లో ఘోరం.. భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 15 మంది మృతి

మధ్యప్రదేశ్‎లోని గ్వాలియర్‌‌‌‌‌‌‌‌లో ఘోరం.. భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 15 మంది మృతి

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని గ్వాలియర్‌‌‌‌‌‌‌‌లో ఘోర ప్రమాదం జరిగింది. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శీతల మాత ఆలయం వద్ద ప్రత్యేక పూజల కోసం గుమిగూడిన భక్తులపైకి ట్రక్కు వేగంగా దూసుకెళ్లడంతో 15 మంది మృతి చెందారు. మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్వాలియర్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని 125 ఏండ్ల చరిత్ర కలిగిన శీతల మాత ఆలయం ఉంది. 

ఆదివారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో వరి ధాన్యం లోడుతో ఉన్న ట్రక్కు 'నో- ఎంట్రీ' జోన్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ట్రక్కును ఆపేందుకు డ్రైవర్​ స్టీరింగ్‎ను గోడవైపు తిప్పాడు. దీంతో ట్రక్కు గోడను ఢీకొట్టి ఆలయ ప్రవేశ ద్వారాన్ని బలంగా తాకింది. ప్రమాద ధాటికి ఆలయ గోడ కూలడంతో భక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. 

ప్రధాని, సీఎం సంతాపం.. ఆర్థిక సాయం

ఈ ఘటనపై ప్రధాని మోదీ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్-గ్రేషియా ప్రకటించారు. మధ్యప్రదేశ్ సీఎం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

9 మంది పోలీసులపై వేటు..

నిషేధిత ప్రాంతంలోకి భారీ ట్రక్కు ఎలా ప్రవేశించిందనే దానిపై సమగ్ర విచారణ జరపాలని సీఎం మోహన్ యాదవ్ అధికారులను ఆదేశించారు. భద్రతా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ గ్వాలియర్ సిటీ ఎస్పీని తొలగిస్తూ, మరో ఎనిమిది మంది పోలీసు 
సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.