- పక్కా కొలతలతో ‘ఎల్పీఎం’ మ్యాప్
- 2,768 గ్రామాలు, నక్షాలు లేని 365 ఊళ్లలో ముమ్మరంగా రీ సర్వే
- నెలాఖరు కల్లా ‘భూభారతి’లో మ్యాపులతో రిజిస్ట్రేషన్లకు మాడ్యూల్ రెడీ
హైదరాబాద్, వెలుగు: బ్రిటీష్ కాలం నాటి పాత సర్వే నంబర్ల గందరగోళానికి రెవెన్యూశాఖ శాశ్వతంగా విముక్తి పలకనుంది. సమగ్ర డిజిటల్ రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే నంబర్లను పూర్తిగా పక్కనబెట్టి, ప్రతి వ్యవసాయ భూకమతానికి విడివిడిగా ‘భూధార్, ల్యాండ్ పార్సెల్ మ్యాప్ (ఎల్పీఎం) నంబర్లను కేటాయించే సరికొత్త వ్యవస్థను అమల్లోకి తెస్తున్నది. తొలి విడత పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసిన మొత్తం 2,768 గ్రామాల్లో డ్రోన్, జీఎన్ఎస్ఎస్, జీఐఎస్, జీపీఎస్ ఆధారిత రీ-సర్వే పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి.
నిజాం కాలం నుంచి అసలు కాడాస్ట్రాల్ మ్యాప్‌లు (నక్షాలు) అందుబాటులో లేని మరో 365 సమస్యాత్మక గ్రామాల్లోనూ అత్యంత వేగంగా సర్వే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో కేవలం కాగితపు దస్తావేజులు కాకుండా, డిజిటల్ నక్షాతో కూడిన రిజిస్ట్రేషన్లను నేరుగా నిర్వహించేందుకు ‘భూ భారతి’ పోర్టల్‌లో సరికొత్త సాఫ్ట్వేర్ మాడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు మాడ్యూల్‌ను క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తెచ్చి, నిర్దేశిత గ్రామాల్లో భూధార్, ఎల్పీఎం ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
11 అంకెలతో భూధార్..
సాధారణంగా క్షేత్రస్థాయిలో రైతులు ‘భూధార్’, ‘ఎల్పీఎం’ రెండూ ఒకటేనని భావిస్తున్నారు. కానీ సాంకేతికంగా ఇవి రెండూ పూర్తిగా వేర్వేరని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పౌరులకు ఆధార్ సంఖ్య ఏ విధంగా పనిచేస్తుందో, వ్యవసాయ భూమికి కేటాయించే ‘భూధార్’ సంఖ్య కూడా అలాగే పనిచేస్తుంది. ఇది రాష్ట్ర కోడ్‌తో ప్రారంభమయ్యే 11 అంకెల గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడెంటిటీ కోడ్). ఉదాహరణకు ఒక రైతు 11 అంకెల నంబర్‌ను భూభారతి పోర్టల్‌లో నమోదు చేయగానే.. ఆ భూమి యజమాని వివరాలు, పట్టాదారు హక్కులు, భూమి రకం, మొత్తం విస్తీర్ణం వివరాలు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతాయి. మరోవైపు ‘ఎల్పీఎం’ అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు.. సదరు భూమి యొక్క వాస్తవ భౌగోళిక రూపాన్ని, నాలుగు వైపుల సరిహద్దులను అంగుళాల వారీగా స్పష్టంగా కళ్లకు కట్టే డిజిటల్ భూపటంగా చెప్పొచ్చు.
సరిహద్దు పంచాయితీలకు చెక్..
ఇప్పటివరకు అమలులో ఉన్న పాత సర్వే నంబర్ల విధానంలో అంతర్గత సబ్-డివిజన్ల కొలతలు పక్కాగా లేకపోవడం వల్లే గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సరిహద్దు పంచాయితీలు నడుస్తున్నాయి. ఉదాహరణకు ఒక రెవెన్యూ పరిధిలోని 115వ సర్వే నంబర్లో మొత్తం 40 ఎకరాల విస్తీర్ణం ఉండి, అందులో 10 మంది రైతులకు భాగస్వామ్యం ఉంటే.. రికార్డుల్లో 115/1, 115/2, 115/2/అ అంటూ రాసుకోవడమే తప్ప, ఎవరి వాటా భూమి ఏ దిక్కున ఉందో చూపే పక్కా అధికారిక నక్షా ఉండేది కాదు.
దీనివల్ల పొరుగు రైతు కొద్దిగా గట్టు జరిపి దున్నినా, ఒకరి హద్దుల్లోకి మరొకరు చొరబడినా తేల్చడం రెవెన్యూ అధికారులకు కష్టంగా ఉండేది. కొత్త విధానంలో అత్యాధునిక డ్రోన్ల సాయంతో ఆ 40 ఎకరాల్లోని ప్రతి గుంటను పిన్-పాయింట్‌గా కొలిచి, ప్రతి ప్లాట్‌కు నిర్దిష్ట అక్షాంశ, రేఖాంశాలతో (కో-ఆర్డినేట్స్) జియో-ట్యాగింగ్ పూర్తి చేస్తున్నారు. ఒక్కో కమతానికి విడివిడిగా శాశ్వత ఎల్పీఎం నంబర్ కేటాయించి సరిహద్దులను సెంటీమీటర్ల తేడాతో డిజిటలైజ్ చేస్తుండటంతో, భవిష్యత్‌లో భూమి హద్దులను ఇసుమంతైనా మార్చడం ఎవరి వల్ల కాదు.
పకడ్బందీగా ల్యాండ్ రికార్డులు..
సర్వేల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ప్రాథమికంగా ‘డ్రాఫ్ట్ ఎల్పీఎం’ మ్యాపులను రూపొందించి, వాటిని నేరుగా ఆయా గ్రామాల చావిళ్ల వద్ద, తహసీల్దార్ ఆఫీసుల్లో రైతుల పరిశీలన కోసం ప్రదర్శిస్తున్నారు. కొలతలు, భూవిస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉన్నా, సరిహద్దులపై అభ్యంతరాలున్నా రైతులు చెప్పుకునేందుకు రెవెన్యూ సదస్సులు, క్యాంపులు నిర్వహిస్తున్నారు. రైతుల సమక్షంలోనే సర్వే బృందాలు వివాదాస్పద స్థలాలను రీ-సర్వే చేసి సరిహద్దులను సరిదిద్దిన తర్వాతే 11 అంకెల భూధార్ ఐడీని లాక్ చేస్తున్నారు.
పూర్వం నుంచి ఎలాంటి కాడాస్ట్రాల్ మ్యాప్‌లు అందుబాటులో లేని 365 సమస్యాత్మక గ్రామాల్లో డ్రోన్ల ద్వారా భూ రకం, వర్గీకరణను పక్కాగా రికార్డు చేస్తూ సమగ్ర నక్షాలను సిద్ధం చేస్తున్నారు. ఈ భూ రికార్డులన్నింటినీ పకడ్బందీగా ‘భూభారతి’ నెట్‌వర్క్‌లో భద్రపరుస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి భూభారతిలో అందుబాటులోకి రానున్న రిజిస్ట్రేషన్ మాడ్యూల్తో భూముల లెక్కలు పక్కా కానున్నాయి.
సివిల్ కోర్టుల్లో కేసులకు పరిష్కారం..
భూధార్ నంబర్, ఎల్పీఎం మ్యాప్ ఆధారంగా భూమికి ప్రభుత్వం నుంచే టైటిల్ గ్యారంటీ ఉండడంతో బ్యాంకులు పంట రుణాలు, వ్యవసాయ ఆధారిత రుణాల మంజూరులో లీగల్ ఒపీనియన్ల పేరుతో రైతులను రోజుల తరబడి తిప్పించుకునే సమస్య ఉండదు. గతంలో ఒకే సర్వే నంబర్ పత్రాలతో వేర్వేరు బ్యాంకులను బురిడీ కొట్టించి రుణాలు పొందిన బోగస్ వ్యవహారాలకు శాశ్వత బ్రేక్ పడనుంది. అంతేకాకుండా రాష్ట్రంలోని సివిల్ కోర్టుల్లో దశాబ్దాల తరబడి గుట్టలుగా పేరుకుపోయిన వేలాది భూ సరిహద్దు దావాలు ఈ డిజిటల్ శాటిలైట్ సాక్ష్యాలతో వేగంగా పరిష్కారం కానున్నాయి.
