- ప్రాణాపాయ స్థితిలో ఏడుగురు
- మృతుల్లో అక్కా తమ్ముళ్లు
- పండుగకు తీసుకువెళ్తుండగాయాక్సిడెంట్
ఎల్బీనగర్, వెలుగు : దసరాకు ముందు పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. శనివారం అర్ధరాత్రి, ఆదివారం జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడి దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.
హయత్‌నగర్‌లో అక్కా తమ్ముడు
పండగకు అక్క, మేనకోడలిని తీసుకువెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి అక్కా తమ్ముళ్లు కన్నుమూశారు. పెద్దఅంబర్ పేట్ కు చెందిన ఏడుళ్ల నవీన్(30) శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన అక్క రేఖ(33), మూడేండ్ల మేనకోడలిని ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట్ కు స్కూటీపై తీసుకువెళ్తున్నాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపానికి చేరుకునేసరికి ముందు డీసీఎం వెళ్తోంది. అయితే, వెనక నుంచి ఓవర్‌స్పీడ్‌తో వచ్చిన థార్వాహనం స్కూటీని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో డీసీఎం, థార్ మధ్యలో ఇరుక్కొని అక్క, తమ్ముడు అక్కడికక్కడే మృతిచెందగా అక్క కూతురు సర్విత(3)కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే దవాఖానకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. హయత్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఎల్బీనగర్లో స్నేహితుల పరిస్థితి విషమం
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీవీఎం కాలేజ్ సమీపంలో విజయవాడ హైవేపై విజయవాడకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన మహేశ్ఎల్బీనగర్లో పాల బిజినెస్ చేస్తుంటాడు. ఇతడు ఎల్బీనగర్కు చెందిన శివ ఎలక్ట్రిషియన్ ఫ్రెండ్స్..భవాని మాల వేసుకోవడంతో శనివారం అర్ధరాత్రి ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎన్టీఆర్నగర్ వెళ్లారు. అర్ధరాత్రి తిరిగి ఎల్బీనగర్కు స్కూటీపై వస్తున్నారు. ఎల్బీనగర్–ఎన్టీఆర్నగర్మధ్యలో విజయవాడ వెళ్లే ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డుపై ఆగి ఉంది. అక్కడ చీకటిగా ఉండడం, వెనక పార్కింగ్లైట్స్(రెడ్లైట్స్) వేసి ఉండడకపోవడంతో గమనించకుండా వచ్చి ఢీకొట్టారు. స్కూటీ నడుపుతున్న మహేశ్ రెండు కాళ్లు , ఒక చేయి విరిగిపోయాయి. వెనక కూర్చున్న శివ కూడా తీవ్రంగా గాయపడ్డారు. కొత్తపేటలోని ప్రైవేట్దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.
వనస్థలిపురంలో కుటుంబానికి తీవ్ర గాయాలు
ఎల్బీనగర్ లో ఉంటున్న రాళ్ళపల్లి వంశీ ఆదివారం మధ్యాహ్నం తన భార్య వాణి,ఇద్దరు కొడుకులు మాన్విష్ , యగ్విష్ లను తీసుకుని బైక్ పై వనస్థలిపురం హైకోర్టు కాలనీలో ఉంటున్న బంధువుల ఇంటికి దసరా పండగకు వెళ్తున్నాడు. ఆ టైంలో వెనకనుండి వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో బైక్ పై నుంచి ఎగిరి పడ్డారు.ఈ ప్రమాదంలో వంశీకి కాలు విరగంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. వాణికి పక్కటెముకలు విరిగాయి. కొడుకు యుగ్విష్ తలకు బలమైన గాయమవ్వడంతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. మాన్విష్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. బీటెక్ చదివే నితిన్ గౌడ్ తన స్నేహితులతో వెళ్తూ ఓవర్ స్పీడ్‌తో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వనస్థలిపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఢీకొట్టిన ఆటో..పై నుంచి వెళ్లిన లారీ..
కుత్బుల్లాపూర్: డి.పోచంపల్లికి చెందిన తుమ్మ మధుసూదన్ (50) ఆదివారం ఉదయం తన ఇంటి నుంచి టూ వీలర్‌పై షాప్‌కి వెళ్తుండగా, గండిమైసమ్మలోని యూసుఫ్‌ఖాన్ బట్టల దుకాణం వద్ద ఓ ఆటో రివర్స్తీస్తూ ఢీకొట్టింది. దీంతో మధుసూదన్ కిందపడ్డాడు. అదే టైంలో గండిమైసమ్మ నుంచి సూరారం వెళ్తున్న లారీ అతడిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. దుండిగల్పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లారీని ఓవర్ టేక్ చేయబోయి ..
మలక్ పేట : హైదరాబాద్ చంచల్‌గూడ ప్రింటింగ్ ప్రెస్ ఎదురుగా ఉన్న స్టీల్ బ్రిడ్జిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో టూ వీలర్నడుపుతున్న చాకలి పవన్ (20) అనే స్టూడెంట్చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పవన్(20) పల్టాన్ లోని హరిహర క్షేత్రం సమీపంలో ఉంటాడు. ఇతడు స్టీల్బ్రిడ్జిపై టిప్పర్ లారీని ఓవర్టేక్చేసే క్రమంలో అదుపు తప్పి మరో వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో పవన్అక్కడికక్కడే కన్నుమూయగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
బోడుప్పల్‌లో కారు బీభత్సం..
మేడిపల్లి : మేడిపల్లి పీఎస్పరిధిలోని బోడుప్పల్‌లో కారు బీభత్సం సృష్టించింది. బాబాయ్ హోటల్‌సమీపంలో ఓ కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొడుతూ వెళ్లి డివైడర్ఎక్కి ఆగిపోయింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా, సుమారు పది బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో మల్కాజిగిరికి చెందిన వెలుగు జర్నలిస్ట్గాయపడగా, ఒక ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. డ్రైవర్ కన్ఫ్యూజన్లో బ్రేక్‌కు బదులు ఎక్సలేటర్తొక్కడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మేడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
