కరెంటోళ్ల పొలం బాట..క్షేత్రస్థాయిలో డిస్కమ్ ఇంజనీర్ల పర్యటన

కరెంటోళ్ల పొలం బాట..క్షేత్రస్థాయిలో డిస్కమ్ ఇంజనీర్ల పర్యటన
  • రైతులతో ముఖాముఖి.. సమస్యల గుర్తింపు
  • ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్ల తనిఖీ.. టెక్నికల్‌‌‌‌‌‌‌‌ అంశాల పరిశీలన   
  • వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్​ అందించడమే లక్ష్యం

హైదరాబాద్, వెలుగు:  గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో కరెంట్ ఆఫీసర్లు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ‘పొలం బాట’ పట్టారు. విద్యుత్ శాఖ ఇంజినీర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది నేరుగా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. వ్యవసాయానికి  కరెంట్​సరఫరా ఎలా ఉంది? ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? విద్యుత్​ సిబ్బంది పనితీరు ఎలా ఉంది? అని అడిగి తెలుసుకున్నారు.

సదరన్ డిస్కమ్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని వికారాబాద్, నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్, నల్గొండ, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, గద్వాల, యాదాద్రి, నల్గొండ, మేడ్చల్‌‌‌‌‌‌‌‌, సూర్యాపేట జిల్లాల్లోని వివిధ సెక్షన్లు, సబ్‌‌‌‌‌‌‌‌ డివిజన్లు, డివిజన్ల పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చౌడర్‌‌‌‌‌‌‌‌గూడ, చిత్తాపూర్, ఉయ్యాలవాడ, నాదింపల్లి, నిజాంపూర్, చౌట్లపల్లి, పుట్టపల్లి, తాడూరు, జంగంపేట, గుమ్మడిదల, కొత్తపల్లి, లక్ష్మీపతిగూడెం, ఆంబదీపల్లి తదితర గ్రామాలతోపాటు పలు వ్యవసాయ ఫీడర్ల పరిధిలో అధికారులు రైతులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంజినీర్లు విద్యుత్ సరఫరాకు సంబంధించిన సాంకేతిక అంశాలను కూడా పరిశీలించారు.

100 కేవీఏ పంపిణీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్ల వద్ద టంగ్ టెస్టర్ ద్వారా విద్యుత్ రీడింగులు తీసుకున్నారు.  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు, బోరు మోటార్ల స్టార్టర్ల వద్ద వోల్టేజీ, కరెంట్ స్థాయిలను తనిఖీ చేశారు. వ్యవసాయ ఫీడర్ల పనితీరు, సరఫరా పరిస్థితులు, విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన అంశాలను క్షేత్రస్థాయిలో సమీక్షించారు.  రైతుల నుంచి అందిన ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకుంటూ, వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావం, వర్షపాత పరిస్థితులు, భూగర్భ 
జలాల లభ్యత, పంటల దిగుబడికి సంబంధించిన అంశాలపై కూడా రైతులతో చర్చించారు. నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు.

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం 

రైతులకు విద్యుత్ శాఖ సేవలను మరింత చేరువ చేయడం. వ్యవసాయ విద్యుత్ సరఫరా పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ‘పొలం బాట’ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. . సాంకేతిక సమస్యలను గుర్తించడం, రైతుల సమస్యలకు క్షేత్రస్థాయిలో పరిష్కార మార్గాలను అన్వేషించడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించాం. రైతులతో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తూ వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరాను చేపడతాం.- జితేశ్ వి . పాటిల్, సదరన్ డిస్కమ్ సీఎండీ, హైదరాబాద్