- గంజాయి అమ్మకాలపైసీనియర్ సిటిజన్ల ఫిర్యాదులు
- టోల్ ఫ్రీ నంబర్ 1908కి ఏడాదిలో 1193 కాల్స్
- డెకాయ్ ఆపరేషన్లతో ఆటకట్టిస్తున్న ఈగల్ ఫోర్స్
- ఈగల్ ఫోర్స్ డైరెక్టర్సందీప్ శాండిల్యా కేస్ స్టడీస్
“చత్రినాకకు చెందిన ఓ యువకుడు(18) మొదట్లో లిక్కర్, తర్వాత గంజాయికి అలవాటు పడ్డాడు. రెండేండ్లుగా పూర్తిగా గంజాయికి బానిసయ్యాడు. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్పు రాలేదు. దీంతో 1908 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. తమ కుమారుడికి ఎక్కడి నుంచి గంజాయి అందుతుందో పూసగుచ్చినట్లు వివరించారు. నిఘా పెట్టిన ఈగల్ ఫోర్స్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి బాధిత యువకుడిని డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు.’’
‘‘చందానగర్ పీఎస్పరిధిలోని ఓల్డ్ ఎమ్‌ఐజీ కాలనీలో పలు పార్కుల వద్ద రాత్రి 10 గంటలు దాటిన తర్వాత అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నారు. స్థానిక యువతకు డ్రగ్స్, గంజాయి సప్లయ్ చేస్తున్నట్లు పరిసర ప్రాంతాల్లో సీనియర్ సిటిజన్లు గుర్తించారు. గంజాయి వినియోగదారుల్లో తన మనువడు కూడా ఉన్నాడని తెలియడంతో ఓ సీనియర్ సిటిజన్ ఈగల్ ఫోర్స్‌కు సమాచారం అందించాడు. దీంతో ఆయా పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టిన ఈగల్ ఫోర్స్ గంజాయి బ్యాచ్ఆటకట్టించింది.’’
హైదరాబాద్, వెలుగు: గంజాయి, డ్రగ్స్ బారిన పడిన యువతకు విముక్తి కల్పించడంలో రాష్ట్ర ఈగల్ పోర్స్ కు బాధితుల పేరెంట్స్, కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారు. వారు ఇస్తున్న సమాచారంతో పోలీసులు డెకాయ్‌ఆపరేషన్లు నిర్వహించి డ్రగ్స్, గాంజా నెట్వర్క్ ను ఛేదిస్తున్నారు. అటు స్మగ్లర్లను పట్టుకోవడంతోపాటు ఇటు బాధితులకు కౌన్సెలింగ్ఇచ్చి డీఅడిక్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఈగల్‌కు క్రమంగా కాల్స్పెరుగుతున్నాయి. ఏడాదిలో టోల్ ఫ్రీ నంబర్ 1908 కి 1193 కాల్స్ వచ్చాయని అధికారులు చెబుతున్నారు. మాదకద్రవ్యాల నివారణ అందరి బాధ్యత అని,- ఏదైనా సమాచారం తెలిస్తే తమకు ఫోన్‌చేసి చెప్పాలని ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా విజ్ఞప్తి చేస్తున్నారు.
టోల్‌ఫ్రీ నంబర్‌కు 1193 ఫిర్యాదులు ఇలా..
గంజాయి, డ్రగ్స్ సహా ఇతర మాదకద్రవ్యాల వినియోగంపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. ఈ మేరకు 2025 జూన్ 26న ఈగల్ ఫోర్స్ ప్రత్యేక హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ నంబర్ 1908, వాట్సాప్ నంబర్ 8712671111 ప్రారంభించింది. విద్యాసంస్థలు, సాంఘిక సంక్షేమ విభాగాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో హెల్ప్ లైన్ నంబర్‌కు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది బాధితుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులే ఉంటున్నారు.
తమకు అందుతున్న ఫిర్యాదుల్లో సుమారు 70 శాతం వాస్తవమేనని ఈగల్ ఫోర్స్ అధికారులు నిర్ధారించారు. గతేడాది జూన్ 16 నుంచి ఈనెల 9 వరకు ఈగల్ ఫోర్స్‌కు మొత్తం1193 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఈ ఏడాది తొమ్మిది నెలల వ్యవధిలోనే 622 ఫిర్యాదు అందగా, తగిన చర్యలు తీసుకున్నట్టు వివరించారు.
గోప్యంగా సమాచారం ఇచ్చే వారి వివరాలు..
డ్రగ్స్ కార్యకలాపాలపై సమాచారం అందించే వారి వివరాలను ఈగల్ఫోర్స్అత్యంత గోప్యంగా ఉంచుతున్నది. స్వతహాగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులే సమాచారం ఇస్తుండడంతో ఈ విషయాన్ని జాగ్రత్తగా డీల్చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రులు అందించిన వివరాల ప్రకారంగా వారి పిల్లల కదలికలపై నిఘా పెట్టి, సప్లయర్లను ట్రేస్ చేసి అరెస్ట్ చేస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలైన వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు డీ అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
డ్రగ్స్ నివారణ మనందరి బాధ్యత..
గంజాయి, సింథటిక డ్రగ్స్ డిమాండ్ తగ్గినప్పుడే సప్లయ్ చైన్ ఆగిపోతుంది. డ్రగ్స్‌పై ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది. తమ పిల్లలు, స్నేహితుల అలవాట్లపై తల్లిదండ్రులు మాకు సమాచారం అందిస్తున్నారు. మత్తు మహమ్మారికి బానిసలైన పిల్లలను కాపాడాలని కోరుతున్నారు. మాదకద్రవ్యాల నివారణ మనందరి బాధ్యత. ఎలాంటి సమాచారం తెలిసినా టోల్‌ఫ్రీ నంబర్, వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలి. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం.- సందీప్ శాండిల్యా, డైరెక్టర్, ఈగల్ ఫోర్స్
ఈగల్ ఫోర్స్ ఇప్పటివరకు నమోదు చేసిన మొత్తం కేసులు, అరెస్ట్‌లు, స్వాధీనం
కేసుల సంఖ్య అరెస్టులు గంజాయి, డ్రగ్స్ మొత్తం సీజర్ విలువ
7,883 17,419 7,030 కిలోలు రూ.455 కోట్లకు పైగా
