- తగ్గిన డాక్యుమెంట్లు, పెరిగిన ప్రాపర్టీల విలువ
- లగ్జరీ ఇండ్లు, ఫ్లాట్లదే హవా
- రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య మందగించినప్పటికీ ప్రభుత్వ ఖజానాకు మాత్రం రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిపడుతోంది. ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఏకంగా రూ.9,051 కోట్ల రాబడిని సాధించింది. నిర్దేశిత స్థూల లక్ష్యం రూ.9,770 కోట్లలో ఇది ఏకంగా 92.64 శాతం కావడం విశేషం. గతేడాది ఇదే సమయానికి వచ్చిన రూ.7,416 కోట్లతో పోలిస్తే ఏకంగా రూ.1,635 కోట్ల అదనపు పెరుగుదలతో 22.05 % వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
ఒక్క సెప్టెంబర్ లోనే రూ.1,476 కోట్ల రాబడి రాగా, గతేడాది సెప్టెంబర్ కంటే 23 % వృద్ధి నమోదైంది. అయితే రిజిస్ట్రేషన్ అయిన దస్తావేజులు1,38,868 కాగా.. గతేడాది కంటే 4,451 డాక్యుమెంట్లు తగ్గడం గమనార్హం. అంటే లావాదేవీల సంఖ్య తగ్గుతున్నా, మార్కెట్ విలువలు పెరగడం, హైఎండ్ విల్లాలు, ఖరీదైన ఫ్లాట్లు, భారీ వెంచర్ల క్రయవిక్రయాలు ఊపందుకోవడంతో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా కాసుల వర్షం కురుస్తోందని శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆదాయం 5.3 రెట్లు హైక్
గత దశాబ్ద కాలంలో (2014–15 నుంచి 2025–26 వరకు) రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఏకంగా 5.3 రెట్లు (430%) పెరిగి సరికొత్త మైలురాయిని తాకింది. 2014–15లో కేవలం రూ.2,746 కోట్లుగా ఉన్న శాఖ వార్షిక ఆదాయం, 2025–26 నాటికి రూ.15,280 కోట్లకు ఎగబాకింది. ఇదే సమయంలో నమోదైన డాక్యుమెంట్లు 8.27 లక్షల నుంచి 17.28 లక్షలకు 120 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.19,540 కోట్ల వార్షిక లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించగా, విభాగాల వారీగా వస్తున్న ఆదాయం సరికొత్త ట్రెండ్‌ను చూపిస్తోంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఫ్లాట్ల ద్వారా రూ.2,508 కోట్లు (23.62% పెరుగుదల), ఇండ్ల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,757 కోట్లు (28.94% పెరుగుదల) ఖజానాకు చేరాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల సంఖ్య 5.2% మేర పడిపోయినప్పటికీ, వాటి ద్వారా వచ్చిన ఆదాయం మాత్రం 35.7 శాతం పెరిగి రూ.922 కోట్లకు చేరింది. ఓపెన్ ప్లాట్ల ద్వారా రూ.1,484 కోట్లు సమకూరాయి. తక్కువ విస్తీర్ణంలో జరిగే విక్రయాలు తగ్గినప్పటికీ, అధిక విలువ కలిగిన ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరగడమే ఈ రెవెన్యూ జంప్‌కు అసలు కారణంగా చెబుతున్నారు.
రంగారెడ్డి, మేడ్చల్ టాప్
రిజిస్ట్రేషన్ల రాబడిలో హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాలే కామధేనువుగా మారాయి. రాష్ట్రంలోని144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కేవలం ఓఆర్ఆర్ లోపల ఉన్న 25 ఆఫీసులు రూ.5219 కోట్లు (34%), ఇరువైపులా ఉన్న 10 ఆఫీసులు రూ.4281 కోట్లు (28%) ఆదాయాన్ని సమకూర్చాయి. అంటే మొత్తం కేవలం 35 కార్యాలయాలే ఏకంగా 62 శాతం రెవెన్యూను కట్టబెడుతున్నాయి. మరోవైపు, ఆర్ఆర్ఆర్ వెలుపలున్న 92 గ్రామీణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 35 శాతం డాక్యుమెంట్లు రిజిస్టర్ అవుతున్నప్పటికీ, ఆదాయం కేవలం 12 శాతమే (రూ.1,827 కోట్లు) కావడం గమనార్హం. నాన్-అగ్రికల్చర్ విభాగంలో రంగారెడ్డి జిల్లా 1.13 లక్షల డాక్యుమెంట్లతో రూ.2,425 కోట్లతో టాప్‌లో ఉండగా, మేడ్చల్-మల్కాజిగిరి రూ.1135 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. పారిశ్రామిక, పట్టణ విస్తరణ ఊపందుకోవడంతో మెదక్ జిల్లా ఏకంగా 54.37 శాతం రికార్డు వృద్ధితో రూ.701.59 కోట్ల ఆదాయం సాధించింది.
రాజధాని పరిసర ప్రాంతాలదే ఆధిపత్యం
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనితీరును పరిశీలిస్తే రాజధాని పరిసర ప్రాంతాలదే పూర్తి ఆధిపత్యంగా కనిపిస్తోంది. ఆగస్టు రాబడిలో రంగారెడ్డి ఆర్వో రూ.124.33 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. గండిపేట రూ.113.14 కోట్లు, పటాన్చెరు రూ.104.42 కోట్లతో వంద కోట్ల క్లబ్లో చేరాయి. కుత్బుల్లాపూర్ రూ.55.15 కోట్లు, శేరిలింగంపల్లి రూ.42.58 కోట్ల రాబడిని సాధించాయి. డాక్యుమెంట్ల నమోదులో పటాన్చెరు 3,105 దస్తావేజులతో రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా ఉండగా, కుత్బుల్లాపూర్ 2,720, వరంగల్ 1,836, గండిపేట 1,811 తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ మెరుగైన పనితీరు కనబరుస్తోంది. ఏపీలో 295 ఎస్ఆర్వోల ద్వారా రూ.11,041 కోట్ల ఆదాయం రాగా.. తెలంగాణలో కేవలం 144 ఎస్ఆర్వోలతోనే రూ.15,280 కోట్ల వార్షిక ఆదాయాన్ని రాబట్టడం గమనార్హం. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే తెలంగాణలో ఒక్కో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సగటున అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తోంది.
