అంబరమే హద్దుగా సద్దుల సంబురం..తీరొక్క పూలతో మెరిసిన నగరం

అంబరమే హద్దుగా  సద్దుల సంబురం..తీరొక్క పూలతో మెరిసిన నగరం
  • ట్యాంక్​బండ్​ వద్ద వేడుక అదుర్స్​.. కూకట్​పల్లిలో గ్రాండ్​గా సెలబ్రేషన్స్​

పద్మారావునగర్​,వెలుగు :  తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సంబురాలు ఆదివారం సాయంత్రం భాగ్యనగరంలో అంబరాన్నంటాయి.  మహానగర వీధులన్నీ పూల పరిమళాలు, మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలతో మార్మోగాయి. తొమ్మిది రోజుల పాటు సాగిన పూల జాతరను ఆదివారం ఘనంగా ముగించారు. ట్యాంక్​బండ్​వద్ద రాష్ట్ర ప్రభుత్వం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. హుస్సేన్ సాగర్ తీరమంతా రంగురంగుల పూల బతుకమ్మలతో శోభాయమానంగా మారింది.సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం నుంచి వందలాది బతుకమ్మలతో మహిళలు, కళాకారులు నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకున్నది. ఈ సంబరంలో హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ జానపద సంస్కృతిని ప్రతిబింబించేలా 700 మంది కళాకారులు 30 రకాల సాంప్రదాయ కళారూపాలను ప్రదర్శించడం వేడుకకే హైలెట్​గా నిలిచింది.  ఇక  రాత్రి వేళ హుస్సేన్ సాగర్ లో నిర్వహించిన లేజర్ షో, ఫైర్​క్రాకర్స్​షో అదుర్స్​అనిపించింది. 

కూకట్​పల్లిలో..
కూకట్​పల్లి : కూకట్​పల్లిలో వేడుకలు ప్రతిసారి లెక్కనే గ్రాండ్​గా జరిగాయి. స్థానిక మహిళలు ఒకరితో ఒకరు పోటీ పడుతూ భారీ బతుకమ్మలను పేర్చారు. హనుమాన్​ టెంపుల్​ వద్దకు చేర్చి ఆడిపాడి ఐడీఎల్​చెరువులో నిమజ్జనం చేశారు. 

బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ..
ముషీరాబాద్​: బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్, ముఖ్య కార్యదర్శి పోశాల సరస్వతి ఆధ్వర్యంలో జలదృశ్యం వద్ద సామాజిక తెలంగాణ థీమ్ తో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.  ఈ వేడుకల్లో పలువురు విదేశీయలు పాల్గొన్నారు. 

బతుకమ్మ ఆడిన సీపీ సుమతి
మల్కాజిగిరి : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సఫిల్‌‌గూడ మినీ ట్యాంక్‌‌బండ్ చెరువు వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మల్కాజిగిరి సీపీ సుమతి పాల్గొన్నారు. ఎప్పుడూ పోలీస్​ యూనిఫాంలో ఉంటే ​కమిషనర్..చీరకట్టులో సంప్రదాయబద్ధంగా సాధారణ మహిళలా అందరితో కలిసిపోయి  ఆడిపాడారు.