బైకర్లకు ఎయిర్ బ్యాగ్ హెల్మెట్లు..చైనాలో జోరుగా ట్రయల్స్

బైకర్లకు ఎయిర్ బ్యాగ్ హెల్మెట్లు..చైనాలో జోరుగా ట్రయల్స్
  • కింద పడగానే సెన్సార్ల సాయంతో ఎయిర్ బ్యాగ్ ఓపెన్
  • తల, మెడకు బలమైన సేఫ్టీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: బైకర్ల ప్రాణాలు కాపాడేందుకు చైనా సరికొత్తగా 'ఎయిర్ బ్యాగ్ హెల్మెట్'ను తీసుకొస్తుంది. కార్లలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నట్టే.. బైక్ రై డర్లు కిందపడగానే ఇది అప్రమత్తమై ప్రాణాలను కాపాడుతుంది. చైనాకు చెందిన లాన్షీ యేమా మోటార్‌‌‌‌సైకిల్ ఫిట్టింగ్స్ సంస్థ దీన్ని డిజైన్ చేయగా, గతేడాది సెప్టెంబర్‌‌‌‌లో పేటెంట్ లభించింది. ప్రస్తుతం ఈ సేఫ్టీ హెల్మెట్ పై చైనాలో జోరుగా ట్రయల్స్ జరుగుతున్నాయి.

ఇది ఎలా పనిచేస్తుందంటే..

సాధారణ హెల్మెట్లు ప్లాస్టిక్ లేదా ఫైబర్‌‌‌‌తో రక్షణ కల్పిస్తే.. ఈ కొత్త హెల్మెట్ అత్యాధునిక మోషన్ సెన్సార్లు, ఎక్సైలరోమీటర్లతో పనిచేస్తుంది. రైడర్ కదలికలను సెకనుకు వందల సార్లు గమనించే ఈ వ్యవస్థ.. బైక్ అదుపుతప్పినా లేదా రైడర్ కిందపడుతున్నా మిల్లీ సెకన్లలో గుర్తిస్తుంది. వెంటనే ఇన్ఫ్లేషన్ సిస్టమ్ ద్వారా ఎయిర్ బ్యాగ్ తెరుచుకుని, తలకు, మెడకు బలమైన కవచంలా అడ్డుగా నిలుస్తుంది. మెడ చుట్టూ కుషన్ లా ఏర్పడి ఎలాంటి జర్క్ లేకుండా కాపాడుతుంది. ఇది కేవలం ఒక్కసారి వాడి పడేసేది కాకుండా, కచ్చితమైన అల్గారిథమ్స్‌‌‌‌తో అత్యవసర సమయాల్లో మాత్రమే స్పందించేలా తీర్చిదిద్దుతున్నారు.

భారత్‌‌‌‌లో మేలు చేసే అవకాశం

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో బైకర్లే దాదాపు 46 శాతం ఉంటున్నారు. ప్రధానంగా తలకు బలమైన గాయాలు కావడం, నాణ్యమైన హెల్మెట్లు వాడకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మన దేశంలోనూ బైక్ యాక్సిడెంట్ మరణాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. కానీ ఇది మార్కెట్లోకి వచ్చే తేదీ, ధర, మన వాతావరణ పరిస్థితులకు ఎంతవరకు మన్నికగా ఉంటుందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

బైక్ యాక్సిడెంట్స్ లో 42 శాతం మంది చనిపోతుండ్రు 

దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 1,407 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. (గంటకు దాదాపు 59 ప్రమాదాలు) జరుగుతుండగా.. రోజుకు సగటున 502 మంది చనిపోతున్నారు అంటే గంటకు 21 మంది మరణిస్తున్నారు. గతేడాది కాలంలో దేశంలో మొత్తం 5,13,563 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా,  వాటిలో 1,83,382 మంది మరణించారు. బైక్‌‌‌‌ నడిపే వారు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న సంఖ్య 46.2 శాతం. ఇందులో ఎక్కువగా బైక్‌‌‌‌లు, స్కూటర్లపై ప్రయాణించే వారే.

హెల్మెట్ ధరించకపోవడం వల్ల, హెల్మెట్ పెట్టుకున్నా నాణ్యమైనది కాకపోవడం, హెల్మెట్ బెల్ట్ పెట్టుకోకపోవడం దీనికి ప్రధాన కారణాలు.  కాగా చైనాలోని ఎయిర్ బ్యాగ్ హెల్మెట్ అందుబాటులోకి వస్తే దేశంలో బైక్ యాక్సిడెంట్లలో మరణిస్తున్న వారి సంఖ్య దాదాపు తగ్గిపోయే అవకాశం ఉంది.