- 10 సార్లు వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టినా అధికారుల్లో రాని చలనం
- డీఈవోలకు పట్టు లేక, సామర్థ్యం చాలకే పనుల్లో తీవ్ర జాప్యం
- ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక బృందాలతో జిల్లాల్లో ఆడిట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సమగ్ర శిక్ష, పీఎం శ్రీ స్కీముల కింద సర్కారు బడుల బాగు కోసం విడుదలవుతున్న నిధులను ఖర్చు చేయడంలో క్షేత్రస్థాయి విద్యాశాఖ యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రభుత్వం నుంచి నిధులు రప్పించుకోవడం ఒక ఎత్తయితే.. చేతికి వచ్చిన పైసలను ఖర్చు పెట్టడం అధికారులకు అంతకంటే పెద్ద టాస్క్‌గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనుల కోసం ఇప్పటివరకు స్పెషల్ ఫండ్ కింద రూ.80 కోట్లు విడుదల చేయగా, జిల్లాల్లో కేవలం రూ.19 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే రాష్ట్రస్థాయిలో నిధుల వినియోగం కేవలం 23 శాతానికే పరిమితమైంది. మరోవైపు ఈ నెల 28 నుంచి 30 వరకు ఢిల్లీలో జాతీయ స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. అక్కడ కేంద్రం ముందు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక రాష్ట్రస్థాయి అధికారులు ఇప్పుడు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. నిధులున్నా పనులు ఎందుకు చేయట్లేదో నిగ్గు తేల్చేందుకు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ.నవీన్ నికోలస్ రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో లెక్కలు తేల్చేందుకు 18 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతూ ఆదేశాలు జారీ చేశారు.
నిధులున్నా ఫలితం సున్నా
నిధుల వినియోగంపై డీఈవోలతో స్టేట్ ఆఫీసు నుంచి ఇప్పటికే దాదాపు 10 సార్లు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. చాలా జిల్లాల్లో డీఈవోలకు ఈ స్కీముల విధివిధానాలపై కనీస పట్టు లేకపోవడం, పనులు చేయించే సామర్థ్యం, పర్యవేక్షణ లోపించడమే ఈ దుస్థితికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జిల్లా స్థాయిలో సమగ్ర శిక్ష కింద స్కూళ్లకు అవసరమైన 14 రకాల వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఆ ప్రక్రియను కూడా సకాలంలో పూర్తి చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. డీఈవోలు చొరవ తీసుకోకపోవడంతో అటు జిల్లాల్లో, ఇటు బడుల ఖాతాల్లో నిధులు మూలుగుతున్నా విద్యార్థులకు మాత్రం మౌలిక వసతులు అందడం లేదు.
రివ్యూతో మొదలైన టెన్షన్
ఈ నెల 28 నుంచి 30 వరకు ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పీఎం శ్రీ, సమగ్ర శిక్ష పథకాల పురోగతిపై జాతీయ స్థాయి సమీక్ష జరగనుంది. ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు కేటాయించిన నిధులను తెలంగాణ ఎంతవరకు వాడిందనే దానిపై కేంద్ర అధికారులు లెక్కలు తేల్చనున్నారు. కేవలం 23 శాతం ఖర్చుతో ఢిల్లీ వెళ్తే కేంద్రం నుంచి విమర్శలు రావడంతో పాటు భవిష్యత్ నిధుల విడుదలలో కోత పడే ప్రమాదం ఉంది. దీంతో ఆ లోపే క్షేత్రస్థాయిలో పనులను పరుగులు పెట్టించాలని నిర్ణయించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు స్టేట్ ఆఫీసు నుంచి అసిస్టెంట్ డైరెక్టర్లు, కోఆర్డినేటర్లు, ప్లానింగ్ అధికారులతో 18 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లాల బాధ్యతలను అప్పగించారు. ఈ అధికారులు ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లాల్లోనే తిష్టవేసి డీఈవో ఆఫీసుల్లో పూర్తిస్థాయి ఆడిట్, సమీక్షలు నిర్వహిస్తారు. ఉదయం పూట జిల్లా స్థాయిలో సమగ్ర శిక్ష, పీఎం శ్రీ నిధుల ఖర్చుపై డీఈవోలు, సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్లు, ఎఫ్ఏవోలతో రివ్యూ చేస్తారు. జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన 14 రకాల వస్తువుల కొనుగోళ్లు ఎక్కడివరకు వచ్చాయో తేలుస్తారు. మధ్యాహ్నం నుంచి ఆయా బడుల హెడ్మాస్టర్లతో సమావేశమై, స్కూల్ లెవల్లో విడుదలైన కాంపోజిట్ గ్రాంట్లు, ఇతర నిధుల ఖర్చుల ఓచర్లు, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.
రాతపూర్వక వివరణ
జిల్లాల పర్యటన ముగిసిన వెంటనే ఆడిట్ బృందాలు నేరుగా ఎస్పీడీకి సమగ్ర నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పాఠశాలలకు, డీపీవోల ఖాతాల్లోకి ఎంత మొత్తం చేరింది? అందులో ఎంత ఖర్చు చేశారు? నిధులున్నా ప్రారంభం కాని పనులేంటి? అనే వివరాలను పూర్తి ఆధారాలతో సేకరిస్తారు. నిధులు పక్కన పెట్టుకుని పనుల్లో ఎందుకు జాప్యం చేశారనే దానిపై సంబంధిత డీఈవో, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్, ఎఫ్ఏవో, హెచ్ఎంల నుంచి అక్కడికక్కడే లిఖితపూర్వక సమాధానం తీసుకోవాలని ఎస్పీడీ నవీన్ నికోలస్ ఆదేశించారు. నిబంధనల ప్రకారం కొనుగోళ్లు జరగకపోయినా, బిల్లులు సరిగా లేకపోయినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
