Jasprit Bumrah: భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ల ముందు ప్రస్తుతం అత్యంత కీలకమైన సవాల్ ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో భాగంగా భారత్ ఆడాల్సిన మిగిలిన 7 టెస్టు మ్యాచ్‌లలో (న్యూజిలాండ్‌తో 2 టెస్టులు, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు) టీమిండియా ప్రధాన పేస్ అస్త్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంపైనే జట్టు విజయాలు ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుమ్రా ఫిట్‌నెస్‌పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు.
బుమ్రాను అన్ని ఫార్మాట్లలో ఆడించొద్దు:
* స్టార్ పేసర్ బుమ్రాపై పనిభారాన్ని (Workload) తగ్గించాల్సిన అవసరం ఉందని మాజీ కోచ్ రవిశాస్త్రి తేల్చి చెప్పాడు. 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహకాల దృష్ట్యా బుమ్రాను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు:
* టెస్టులకే పెద్ద పీట: బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ నిరంతరం ఆడకూడదని నేను గట్టిగా నమ్ముతున్నాను.. అతను కేవలం టెస్టు క్రికెట్ మాత్రమే ఆడాలి.. కానీ వన్డేలు, టీ20లలో అప్పుడప్పుడు (Sporadically) మాత్రమే బరిలోకి దిగాలని సూచించాడు. ఏ మ్యాచ్ పడితే ఆ మ్యాచ్‌లో అతన్ని ఆడించొద్దని శాస్త్రి సూచించాడు.
* రవిశాస్త్రి సూచనలతో బోర్డు సెలక్టర్లు కూడా ఏకీభవించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తుంది.
రిషబ్ పంత్పై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు:
* ఇదే సందర్భంలో రిషబ్ పంత్ (Rishabh Pant) గురించి రవిశాస్త్రి మాట్లాడుతూ.. పంత్ తన సహజమైన ఆటశైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.
* నేను ఎప్పుడూ రిషబ్ పంత్‌కు ప్రత్యేకంగా ఎలాంటి సందేశాలు ఇవ్వలేదు.. నేను అతనికి చెప్పేదొక్కటే.. మైదానంలో చాలా స్మార్ట్‌గా ఉండు, మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకో. ఎవరి కోసం నువ్వు నీ ఆటను మార్చుకోవాల్సిన అవసరం లేదన్నాడు. నీ సహజమైన శైలిలోనే ఆడు అని పంత్‌కు శాస్త్రి మద్దతుగా నిలిచాడు.
