చిరు వ్యాపారుల అభివృద్ధే లక్ష్యం.. చెన్నూరులో షాపింగ్ కాంప్లెక్స్‌కు మంత్రి వివేక్ శంకుస్థాపన

 చిరు వ్యాపారుల అభివృద్ధే లక్ష్యం.. చెన్నూరులో  షాపింగ్ కాంప్లెక్స్‌కు మంత్రి వివేక్ శంకుస్థాపన

చెన్నూరు, మంచిర్యాల జిల్లా: స్థానిక చిరు వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి, మున్సిపాలిటీ ప్రాంగణంలో రూ. కోటి వ్యయంతో నిర్మించనున్న నూతన ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కాంప్లెక్స్ అందుబాటులోకి వస్తే స్థానిక చిరు వ్యాపారులకు మెరుగైన వాణిజ్య వసతులు కల్పించడంతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు.

షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు  వార్డులను సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, ఉచిత మందుల పంపిణీ, భోజన వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వైద్యులు, ఆసుపత్రి సిబ్బందితో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న పడకల సంఖ్య, అదనపు పడకల అవసరం, మందుల లభ్యత, కొరత ఉన్న ఔషధాలు, ఆధునిక వైద్య పరికరాల అవసరాలపై వివరాలు తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం అత్యంత ప్రాధాన్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. వైద్య సేవల విషయంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండాలని హెచ్చరించారు.

చెన్నూరు ప్రభుత్వాసుపత్రిలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత లేకుండా చూస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అవసరమైన వైద్య సదుపాయాలను మెరుగుపరచి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.