దసరాకు మారుతీ సుజుకీ ఆల్టో, ఎస్‌ప్రెస్సో కార్లు కొంటున్నారా? ఈ గుడ్‌న్యూస్ మీకే

దసరాకు మారుతీ సుజుకీ ఆల్టో, ఎస్‌ప్రెస్సో కార్లు కొంటున్నారా? ఈ గుడ్‌న్యూస్ మీకే

దసరా పండుగ వేళ కారు కొనుగోలు చేయాలని భావించే మధ్యతరగతి ప్రజలకు మారుతీ సుజుకీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కార్ల తయారీ ముడిపదార్థాల ఖర్చులు విపరీతంగా పెరిగినప్పటికీ.. ఆల్టో, ఎస్-ప్రెస్సో కార్ల ధరలను పెంచబోమని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో ఇతర మోడళ్లపై 3 సార్లు ధరలు పెంచినప్పటికీ.. ఎంట్రీ-లెవల్ కార్ల ధరలను మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగించాలని కంపెనీ నిర్ణయించింది.

జీఎస్టీ రేట్ల తగ్గింపు తర్వాత చిన్న కార్ల అమ్మకాలు పుంజుకోవడంతో.. ఫస్ట్ టైం కారు కొనే కస్టమర్లను ఆకట్టుకునేందుకు మారుతీ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. సుమారు రూ.3లక్షల 50వేల నుంచి రూ.3లక్షల 70వేల ప్రారంభ ధర కలిగిన ఈ రెండు మోడళ్లు దసరా షాపర్లకు చక్కటి ఎంపికగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది జనవరి-ఆగస్టు మధ్య కాలంలో వీటి సగటు నెలవారీ అమ్మకాలు దాదాపు 47 శాతం పెరిగి 12వేల 700 యూనిట్లకు చేరాయి. టూ-వీలర్ నుంచి ఫోర్-వీలర్‌కు అప్‌గ్రేడ్ అయ్యే గ్రామీణ, పట్టణ ప్రజలకు కంపెనీ నిర్ణయం ఊరటనిస్తుంది.

అంతర్జాతీయ కారణాలతో ఉక్కు, రబ్బరు, ఆటోమోటివ్ ప్లాస్టిక్స్ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఆటోమొబైల్ రంగంపై భారం పడుతోంది. ఇతర కంపెనీలు ధరలను 3 నుంచి 6 శాతం వరకు పెంచగా.. మారుతీ మాత్రం ఎంట్రీ-లెవల్ కార్ల ధరలను స్థిరంగా ఉంచింది. తమ హై-ఎండ్ SUV మోడళ్ల నుంచి వచ్చే మెరుగైన లాభాల ద్వారా మినీ కార్ల భారాన్ని సమర్థవంతంగా తట్టుకుంటోంది. దీర్ఘకాలికంగా కస్టమర్లను నిలుపుకోవడంలో ఈ వ్యూహం కీలక పాత్ర పోషిస్తోందని కంపెనీ నమ్ముతోంది. దసరా పండుగ ఆఫర్ల మధ్య బడ్జెట్ ధరలో లభించే ఆల్టో, ఎస్-ప్రెస్సో కార్లు సామాన్యుల కారు కలను సాకారం చేస్తున్నాయి.