ఇండియన్ ఆల్కహాల్ బెవరేజెస్(అల్కోబెవ్) ఇండస్ట్రీ దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తోంది. ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ISWAI) విడుదల చేసిన రిపోర్ట్స్ ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల రూపంలో ఆల్కహాల్ ఇండస్ట్రీ దేశ ఖజానాకు సుమారు రూ.4 లక్షల కోట్లు అందించింది. దేశ మొత్తం పన్ను వసూళ్లలో ఇది సుమారు 6.6 శాతంగా ఉంది.
మద్యం అమ్మకాల నుంచి వస్తున్న ఆదాయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలో మద్యం వాటా ఏకంగా 32 శాతంగా ఉందని రిపోర్ట్ స్పష్టం చేసింది. ఈ జాబితాలో తమిళనాడు 27 శాతంతో 2వ స్థానంలో, ఉత్తరప్రదేశ్ 25 శాతంతో 3వ స్థానంలో నిలిచాయి. కొన్ని ఇతర రాష్ట్రాల్లోనూ ఈ వాటా 20 శాతానికి పైగా ఉండటం గమనార్హం. మైనింగ్ తక్కువగా ఉండటం వల్ల తెలంగాణలో మద్యంపై పన్నుల భారం ఎక్కువగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
దేశవ్యాప్తంగా చూస్తే.. రాష్ట్రాల సొంత పన్ను ఆదాయంలో మద్యం వాటా సగటున 19.1 శాతంగా ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 2లక్షల 40వేల కోట్లుగా ఉన్న ఈ పన్ను ఆదాయం.. తాజా నివేదిక నాటికి భారీగా పెరిగింది. క్యాలెండర్ ఇయర్ 2025 నాటికి ఈ పరిశ్రమ మార్కెట్ సైజు రూ.6 లక్షల 20వేల కోట్లకు చేరింది. ఇది దేశ నామినల్ జీడీపీలో దాదాపు 1.8 శాతంగా ఉంది. పన్నుల ఆదాయమే కాకుండా, వ్యవసాయ రంగం నుంచి తయారీ, ప్యాకేజింగ్, హోటళ్లు, రెస్టారెంట్ల రంగాల ద్వారా కోట్లాది మందికి ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోంది.
ప్రభుత్వాలు ఆదాయం కోసం మద్యంపై అతిగా ఆధారపడటం ఆందోళనకరమని ISWAI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజిత్ పాధి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాల సొంత పన్ను ఆదాయం ప్రధానంగా పెట్రోలియం, స్టాంప్ డ్యూటీ, మైనింగ్ రాయల్టీలు, ఆల్కహాల్పైనే ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు.
అమ్మకాల్లో కర్ణాటక టాప్..
మద్యం నుంచి పన్నుల ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం టాప్ ప్లేసులో ఉన్నప్పటికీ.. అత్యధికంగా మద్యం అమ్మకాలు జరుగుతోంది మాత్రం కర్ణాటకలో అని లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అమ్మకాల పరంగా దేశంలోని టాప్ 10 రాష్ట్రాల జాబితా చూద్దాం రండి..
1. కర్ణాటక: 6కోట్ల 88 లక్షల కేసులు
2. తమిళనాడు: 6కోట్ల 44లక్షల నుండి 6కోట్ల 47లక్షల కేసులు
3. తెలంగాణ: 3కోట్ల 71లక్షల కేసులు
4. ఆంధ్రప్రదేశ్: 3కోట్ల 55లక్షల కేసులు
5. మహారాష్ట్ర: 2కోట్ల 71లక్షల కేసులు
6. ఉత్తరప్రదేశ్: 2కోట్ల 50లక్షల కేసులు
7. కేరళ: 2కోట్ల 29లక్షల కేసులు
8. పశ్చిమ బెంగాల్: కోటి 49 లక్షల కేసులు
9. రాజస్థాన్: కోటి 37లక్షల కేసులు
10. ఢిల్లీ: కోటి 18 లక్షల కేసులు
