పండుగ పూట ఇంట విషాదం: సెలవుపై వచ్చి ఉరివేసుకున్న ఆర్మీ జవాన్

పండుగ పూట ఇంట విషాదం: సెలవుపై వచ్చి ఉరివేసుకున్న ఆర్మీ జవాన్

వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దేశం కోసం ప్రాణాలొదిలే సైనికుడొకడు, కన్నవారి కడుపుకోతకు కారణమయ్యాడు. దసరా పండుగ సంతోషంలో ఉండాల్సిన ఆ కుటుంబంలో తీరని రోదన మిగిలింది.

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన బోయిని మల్లేశం (28) ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దసరా పండుగ కోసం కొద్ది రోజుల కిందటే ఆయన సెలవుపై ఇంటికి వచ్చారు. నిన్న రోజంతా భార్య, కుటుంబ సభ్యులతో ఎంతో సరదాగా గడిపారు.

కానీ, అంతలోనే ఏం జరిగిందో ఏమో... రాత్రి అందరూ నిద్రలోకి వెళ్లిన తర్వాత, బెడ్రూంలో ఉరివేసుకుని మల్లేశం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం విగతజీవుడిగా పడి ఉన్న ఆయనను చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

కేవలం 8 నెలల క్రితమే మల్లేశంకు వివాహం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుటుంబ పెద్దదిక్కు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోనూ తీవ్ర విషాదం నెలకొంది.