ఈ విల్లా ప్రాజెక్టుల్లో రాజకీయ నాయకులు లేరు కదా : మారిన హైదరాబాద్ కొనుగోదారుల ఆలోచన

 ఈ విల్లా ప్రాజెక్టుల్లో రాజకీయ నాయకులు లేరు కదా : మారిన హైదరాబాద్ కొనుగోదారుల ఆలోచన

హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారుల ప్రాధాన్యతలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఇల్లు అంటే సౌకర్యాలు, అనుకూలమైన ప్రాంతం, ధర లాంటి వాటికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు భయ్యర్స్. కానీ ఇప్పుడు ప్రశాంతత, పర్సనల్ ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.

పొరుగున రాజకీయ నాయకులు వద్దు:
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ సతీష్ రెడ్డి ఎక్స్ వేదికగా పంచుకున్న ఒక పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఒక లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తున్న క్లయింట్.. సేల్స్ హెడ్‌ని అడిగిన మొదటి ప్రశ్న అందరినీ ఆశ్చర్యపరిచింది. "ఈ విల్లాస్‌లో పెద్ద పొలిటిషియన్లు ఎవ్వరూ తీసుకోలేదు కదా?" అని ఆయన సూటిగా ప్రశ్నించట. కేవలం లొకేషన్, బడ్జెట్ మాత్రమే కాకుండా.. పక్కన ఎలాంటి వారు నివసిస్తున్నారనే అంశాన్ని కూడా కొనుగోలుదారులు పరిశీలిస్తున్నారనడానికి ఇది నిదర్శనం.

అసలు సమస్యేంటి?
రాజకీయ నాయకులు నివసించే ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే కొన్ని పరిణామాలు ఇతర ఫ్యామిలీలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. నాయకుల పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాల్లో అభిమానులు, కార్యకర్తలు వేసే భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కొన్నిసార్లు నెలల తరబడి రోడ్ల వెంట అలాగే ఉండిపోతాయి. నానక్‌రామ్‌గూడలోని ఎన్‌సీసీ అర్బన్ వన్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి బ్యానర్లు చాలా కాలం పాటు ఉంటున్నాయని, దీనివల్ల సొసైటీ ప్రశాంతత దెబ్బతింటున్నట్లు ఫ్లాట్ ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిరంతరం జనసంచారం:
ప్రముఖ రాజకీయ నాయకుల నివాసాల చుట్టూ నిత్యం భారీ జనసంచారం, అనుచరుల తాకిడి, వీఐపీ సెక్యూరిటీ తనిఖీలు ఉంటాయి. పండుగలు, స్పెషల్ డేస్ సమయంలో ఈ సందడి మరింత పెరుగుతుంది. ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునే ఐటీ నిపుణులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఉన్నత స్థాయి నిపుణులకు ఈ హడావుడి తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి గండిపేట్ ప్రాంతానికి మారిన కొందరు వ్యక్తులు కూడా ఇదే రకమైన అనుభవాలను పంచుకోవడం గమనార్హం.

మారిన లగ్జరీ అర్థం:
ఈ వైరల్ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. లగ్జరీ ఇల్లు అంటే కేవలం బ్యూటిఫుల్ ఇంటీరియర్స్, విశాలమైన స్థలం మాత్రమే కాదని, ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్రశాంతమైన పరిసరాలు అని లగ్జరీ ప్రాపర్టీలు కొంటున్న ఓనర్స్ ప్రస్తుతం భావిస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఈ కొత్త ట్రెండ్ రాబోయే రోజుల్లో ప్రాపర్టీల ఎంపికపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.