కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగాజరుగుతన్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు సోమవారం( అక్టోబర్ 19) ఉదయం శ్రీవారి స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు రథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. గోవింద నామస్మరణలతో తిరుమల మాడవీధులు మార్మోగాయి.
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా సాగింది.ప్రత్యేక పుష్పాలంకరణలు, ఆభరణాలతో సర్వాలంకార భూషితులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ రథంపై భక్తులను అనుగ్రహించారు.
మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య స్వర్ణ రథోత్సవం వైభవంగా కొనసాగింది.బంగారు రథంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మాడవీధులకు తరలివచ్చారు.స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.శ్రీవారి స్వర్ణ రథోత్సవంతో తిరుమలలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది
