
భారత దేశంలో అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. ప్రతి పండుగ కూడా ఏదో క్షేత్రంలో ఎంతో వైభవంగా జరుగుతాయి. దసరా నవరాత్రి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాలతో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘనంగా జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఎంతో విశిష్టత.. ప్రాధాన్యత కలిగిన దుర్గాదేవి క్షేత్రాల గురించి దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలుసుకుందాం. .
దసరా నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22 న ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో బాసర ఙ్ఞాన సరస్వతి అమ్మవారు .. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గ అమ్మవారు ..మహారాష్ట్ర కొల్హాపూర్ లోని మహాలక్ష్మి దేవాలయం ... జమ్మూ & కాశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయం.. పశ్చిమ బెంగాల్ దక్షిణేశ్వర్ కాళి ఆలయం మరియు కాళీఘాట్ ఆలయం... అస్సాంలోని కామాఖ్య ఆలయం....హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలా దేవి ఆలయం... కర్ణాటక చాముండేశ్వరి ఆలయం... రాజస్థాన్ కర్ణి మాత ఆలయాల్లో ఎంతో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ దేవాలయాల్లో దసరా తొమ్మిది రోజుల పాటు లక్షలాది మంది భక్తు లు పవిత్రమైన దుర్గా ఆలయాలను సందర్శిస్తారు.
బాసర ( తెలంగాణ) : దసరా నవరాత్రి బాసర ఙ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా జరుగుతాయి. తొమ్మిది రోజుల పాటు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మూల నక్షత్రం రోజున అక్షరాభ్యాసాలు జరుగుతాయి. శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాకాళి, శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ముగ్గురు అమ్మర్లు కొలువై ఉంటారు.
విజయవాడ ( ఆంధ్రప్రదేశ్) : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారిని మూడు దశల్లో ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి మూడు రోజులు పార్వతిగా, తదుపరి మూడు రోజులు లక్ష్మీగా.. చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. ఈ తొమ్మిది రోజులు దేవికి ప్రత్యేక పూజలు, యజ్ఞాలు, హోమాలు నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు.
మహాలక్ష్మి దేవాలయం( మహారాష్ట్ర) : అమ్మవారి 51 శక్తిపీఠాలలో కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి ఆలయం ఒకటి . ఈ దేవాలయాన్ని అంబాబాయి ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయంలోని శిల్పాలు ఆధ్యాత్మికతను సంతరించుకుంటాయి. ఈ దేవాలయానికి ఏడాది పొడవునా.. యాత్రికులు సందర్శిస్తుంటారు. దసరా పండుగ సమయంలో తొమ్మిది రోజుల పాటు విశేషంగా పూజలు చేస్తారు.
వైష్ణో దేవి ఆలయం( జమ్మూ & కాశ్మీర్) : భారతదేశంలోని అత్యంత పవిత్రమైన తీర్థయాత్రల్లో వైష్ణో దేవి ఆలయం. ఈ ఆలయం త్రికూట పర్వతాలలో ఉంది. భక్తులు నిటారుగా ఉన్న కొండపైకి ట్రెక్కింగ్ లేదా గుర్రాల మీద ఎక్కి చేరుకోవాలి. అమ్మవారిని దర్శించుకొనేందుకు కొండల మీదుగా వెళ్తూ భక్తులు జై మాతా నినాదాలు చేస్తారు. దసరా సమయంలో ప్రత్యేకంగా అలంకరణ చేస్తారు. కుంకుమపూజలకు ఈ దేవాలయంలో ఘనంగా నిర్వహించబడుతాయి.
దక్షిణేశ్వర్ కాళి ఆలయం( పశ్చిమ బెంగాల్) : కోల్‌కతాలోని హుగ్లీ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం దుర్గాదేవి ఉగ్ర అవతారమైన కాళి దేవి విగ్రహం. 19వ శతాబ్దంలో రాణి రష్మోని నిర్మించిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయానికి రామకృష్ణ పరమహంస మహర్షితో బలమైన సంబంధాలు ఉన్నాయని చెబుతుంటారు. దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలో ఈ దేవాలయానికి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తారు.
కాళీఘాట్ ఆలయం : ఈ దేవాలయం కూడా పశ్చిమ బెంగాల్ లోనే ఉంది. ఈ ఆలయం శక్తి పీఠాలలో ముఖ్యమైనది. సతీదేవి కుడికాలి వేలు ఈ ప్రాంతంలో పడిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. పార్వతి దేవి అంశంగా భావించే ఈ కాళీఘాట్ ఆలయం లో అమ్మవారిని ఏడాది పొడవునా భక్తులు దర్శించుకుంటారు.
కామాఖ్య ఆలయం( అస్సాం) : ఈ ఆలయం గౌహతిలో ఉంది. అత్యంత ప్రభావవంతమైన శక్తి పీఠం. ఈ ఆలయాన్ని స్త్రీశక్తి స్వరూపంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం అంబుబాచి మేళా పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో ప్రత్యేక పూజలు.. హోమాలు నిర్వహిస్తారు. లక్షలాదిగా భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు.
జ్వాలా దేవి ఆలయం( హిమాచల్ ప్రదేశ్) : ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. అన్ని గుళ్లల్లో మాదిరిగా ఇక్కడ విగ్రహం ఉండదు. దేవత శబ్దాలుగా అగ్ని జ్వాలలను పూజిస్తారు. దసరా నవరాత్రిళ్ల సమయంలో అమ్మవారికి అనేక శక్తి హోమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయం కాంగ్రాలోయ ప్రాంతంలో ఉంది.
చాముండేశ్వరి ఆలయం( కర్ణాటక) : మైసూరు లో చాముండి కొండలపై ఈ ఆలయం ఉంది. ఇక్కడ దసరా ఉత్సవాలు చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా మైసూరులో జరిగే దసరా ఉత్సవాలను తిలకిస్తారు. ఈ ఆలయం దాదాపు వెయ్యేళ్ల నాటిదని.. యాత్రికులు ఈ మందిరానికి వెయ్యి మెట్లు ఎక్కి చేరుకుంటారు. ఈ దేవాలయంలో ఉండే శిల్పాలు చాలా అందంగా ఉంటాయి.
కర్ణి మాత ఆలయం(రాజస్థాన్) : బికనీర్‌లో కర్ణిమాత ఆలయం వేలాడి ఎలుకలకు నివాసం. ఇక్కడ వీటిని చాలా గౌరవంగా చూస్తారు. ఇక్కడ తెల్ల ఎలుకలు చాలా అరుదుగా ఉంటాయి. భారతదేశంలో నే కాకుండా అంతర్జాతీయంగా ఎలుకల ఆలయం గా ప్రసిద్ధి చెందింది. గణపతి వాహనం ఎలుక అని అందరికి తెలిసిందే.. గణపతి తల్లి పార్వతిదేవి.. దసరా నవరాత్రి ఉత్సవాల్లో పార్వతిదేవిని పూజిస్తారు. కాబట్టి దసరా పండుగ సమయంలో అమ్మవారికి ఎంతో వైభవంగాపూజలు చేస్తారు.