దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుగా పేరొందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అటాను చక్రవర్తి అనూహ్య రాజీనామాతో గురువారం స్టాక్ మార్కెట్‌లో బ్యాంక్ షేర్లు కుప్పకూలాయి. బుధవారం రాత్రి ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ సమాచారం బయటకు రావడంతో.. ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళన చెందారు. దీని ప్రభావంతో బ్యాంక్ షేరు విలువ దాదాపు 9 శాతం వరకు పడిపోయి.. సరికొత్త 52 వారాల కనిష్ట స్థాయి రూ.770 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఫలితంగా కేవలం ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లు ఏకంగా రూ. లక్ష కోట్లకు పైగా సంపదను కోల్పోయారు.
అటాను చక్రవర్తి రాజీనామా వెనుక ఉన్న కారణాలు ఇప్పుడు బ్యాంకింగ్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్న అంశాలు బ్యాంక్ అంతర్గత వ్యవహారాలపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. గత రెండేళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పద్ధతులు, సంఘటనలు తన వ్యక్తిగత విలువలకు, నైతికతకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన కుండబద్దలు కొట్టారు. సాధారణంగా కార్పొరేట్ రాజీనామాలు వ్యక్తిగత కారణాలని చెబుతూ ముగుస్తాయి. కానీ చక్రవర్తి నేరుగా నైతిక విభేదాలను ప్రస్తావించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఈ రాజీనామాలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అటాను చక్రవర్తి తన లేఖలో ఇండిపెండెంట్ డైరెక్టర్లకు, జూనియర్, మిడిల్ లెవల్ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ బ్యాంక్ టాప్ మేనేజ్మెంట్ పై మాత్రం మౌనం వహించారు. సీఈఓ శశిధర్ జగదీశన్, డిప్యూటీ ఎండీ కైజాద్ భరూచా వంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పేర్లను ఆయన కనీసం ప్రస్తావించకపోవడం, మేనేజ్‌మెంట్‌తో ఆయనకు ఉన్న విభేదాలు ఎంత ముదిరాయో స్పష్టం చేస్తోంది. అయితే ఈ రాజీనామాకు ఆర్‌బీఐ నిబంధనలకు లేదా ఇతర రెగ్యులేటరీ అంశాలకు ఎటువంటి సంబంధం లేదని బ్యాంక్ యాజమాన్యం స్పష్టం చేస్తోంది.
పరిస్థితిని చక్కదిద్దడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెంటనే రంగంలోకి దిగింది. అటాను చక్రవర్తి స్థానంలో కెకి మిస్త్రీని 3 నెలల కాలానికి పార్ట్-టైమ్ చైర్మన్‌గా నియమించడానికి ఆర్‌బీఐ అనుమతి పొందింది. గురువారం ఉదయం నిర్వహించిన ఇన్వెస్టర్ల కాన్ఫరెన్స్ కాల్‌లో బ్యాంక్ మేనేజ్‌మెంట్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. బ్యాంకులో ఎటువంటి పెద్ద సమస్యలు లేవని, కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని.. తమ నైతిక విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ వంటివి ఈ పరిణామం స్టాక్ ధరపై ఒత్తిడి పెంచుతుందని హెచ్చరిస్తున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి సంస్థలో ఇటువంటి నాయకత్వ సంక్షోభం తలెత్తడం సాధారణ విషయం కాదు. 35 లక్షల మందికి పైగా రిటైల్ ఇన్వెస్టర్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ బ్యాంకులో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు మేనేజ్‌మెంట్ తనపై వస్తున్న విమర్శలను ఎలా తిప్పికొడుతుంది, కెకి మిస్త్రీ ఆధ్వర్యంలో బ్యాంక్ తన పూర్వ వైభవాన్ని, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది అనేది రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిన అంశంగా చెబుతున్నారు ఇన్వెస్ట్మెంట్ నిపుణులు.
