మనోళ్లు పని చేస్తలే.. దావతులు ఎక్కువైనయ్..పొద్దంతా ఫోన్లతోనే గడుపుతున్రు: గుత్తా సుఖేందర్ రెడ్డి

మనోళ్లు పని చేస్తలే.. దావతులు ఎక్కువైనయ్..పొద్దంతా ఫోన్లతోనే గడుపుతున్రు: గుత్తా సుఖేందర్ రెడ్డి
  • బిహార్​, యూపీ కూలీలు రాకుంటే వడ్ల కొనుగోళ్లు ఆగుతున్నయ్​: గుత్తా సుఖేందర్​రెడ్డి
  •     మనోళ్లు  40 కిలోల బస్తా కూడా మోయలేకపోతున్నరు
  •     పొద్దంతా ఫోన్లతోనే గడుపుతున్రు
  •     స్కీములల్ల అనర్హులే ఎక్కువున్నరు
  •     ఏ సర్కారు ఉన్నా ఇవే సమస్యలు
  •     యాదాద్రి కలెక్టరేట్​లో స్మార్ట్​ రేషన్​ కార్డుల పంపిణీ


యాదాద్రి, వెలుగు :  “నిరుద్యోగ సమస్య ఉందని మొత్తుకుంటున్నరు. కానీ ఏ పని చేయడానికి మనోళ్లు(తెలంగాణ ప్రజలు) సిద్ధంగా లేరు. దావత్​లు ఎక్కువ అవుతున్నాయి. పనికి వెళ్లినా.. ఫోన్​తో ఎక్కువగా గడుపుతున్నారు.. చిన్న పని చేయాలన్నా.. ఇతర రాష్ట్రాల వాళ్లే చేస్తున్నారు.' అని  శాసనమండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి అన్నారు. యాదాద్రి కలెక్టరేట్​లో శనివారం జరిగిన స్మార్ట్​ రేషన్​ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గుత్తా  మాట్లాడారు. బిహార్​, ఉత్తరప్రదేశ్​ రాష్ట్రాల నుంచి కూలీలు రాకుంటే వడ్ల కొనుగోళ్లు ఆగిపోతున్నాయని, మనవాళ్లు 40 కిలోల బస్తాలను కూడా మోయలేకపోతున్నారని వాపోయారు.  ఇప్పుడు తెలంగాణలో 20 లక్షల మంది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు పనులు చేస్తున్నారని, ఇప్పుడు ఆ రాష్ట్రాల్లోనూ స్కీమ్స్​ అమలు చేస్తున్నందున రాబోయే రోజుల్లో అక్కడి నుంచి కూడా ఎవరూ రారన్నారు.  అప్పుడు మన పని మనమే చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.  అందుకే మన పిల్లలను పని చేసే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. గొప్పలకు పోయి కష్టాలపాలు కాకుండా.. మన పని మనం చేసుకుంటూ ఉన్నదాంట్లోనే సంతృప్తి చెందాలని ఆయన సూచించారు.  ఎవరో కొందరు పని గట్టుకొని ప్రజల్లో అసంతృప్తి ఉందంటూ ప్రచారం చేస్తున్నారని, కానీ  ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి లేదని,  అసంతృప్తంతా పదవులు లేని తెల్లబట్టల (రాజకీయ నాయకులు) వాళ్లకే ఉందన్నారు. 

వెల్ఫేర్​ స్కీమ్స్​లలో అనర్హులు.. 

కేసీఆర్​ హయాంలో అమలు చేసిన స్కీమ్స్​లలో ఏ ఒక్కటీ ఆపకుండా..కొత్తవి అమలు చేస్తున్నామని మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి చెప్పారు. ఉన్న అప్పులకు తోడు కొత్త అప్పులు చేస్తేనే అభివృద్ధి, వెల్ఫేర్​ స్కీమ్స్​ అమలు చేయగలమన్నారు. రేవంత్​ సర్కారు పోయి కొత్త సర్కారు వచ్చినా ఇవే సమస్యలు కంటిన్యూ అవుతాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వెల్ఫేర్​ స్కీమ్స్​లలో అనర్హులు ఉన్నారని గుత్తా అన్నారు.  ‘అనర్హుల కారణంగా స్కీమ్స్​ ఆగిపోయే ప్రమాదం ఉంది..’ అన్నారు. అమలు చేస్తున్న స్కీమ్స్​ గురించి కాకుండా..రాని స్కీమ్స్​ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు.  దేశంలో 35 శాతం బీపీఎల్​ కుటుంబాలు ఉంటే.. మన రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకు రేషన్​ కార్డులు జారీ అయ్యాయని తెలిపారు. యాదాద్రి జిల్లాలోనే కుటుంబాల కంటే 25 వేల రేషన్​ కార్డులు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. సర్వే చేస్తే కార్డులు పోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రజల్లో ముఖ్యంగా మాలాంటి వారు (రాజకీయ నాయకులు) ఉన్నదాంతో సంతృప్తి పడకుండా కోర్కెలు పెంచుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే నాకంటే గొప్పోడా..? నేను ఎందుకు కాకూడదని అనుకుంటున్నారని  ఆయన అన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, కలెక్టర్​ అనురాగ్​ జయంతి, ఎస్పీ అక్షాంక్ష్​ యాదవ్​ తదితరులు ఉన్నారు.