తెలంగాణ రాష్ట్రంలో గ్రేడ్‌‌‌‌‌‌‌‌-1 పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ లిస్ట్‌‌‌‌‌‌‌‌ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో  గ్రేడ్‌‌‌‌‌‌‌‌-1 పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ లిస్ట్‌‌‌‌‌‌‌‌ విడుదల
  •     7 జోన్లలో 377 మందితో ప్రొవిజనల్‌‌‌‌‌‌‌‌ జాబితా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రేడ్‌‌‌‌‌‌‌‌-1 పంచాయతీ కార్యదర్శుల ప్రొవిజనల్‌‌‌‌‌‌‌‌ సీనియారిటీ జాబితాను పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌, గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. జోన్‌‌‌‌‌‌‌‌-1 నుంచి జోన్‌‌‌‌‌‌‌‌-7 వరకు 377 మంది కార్యదర్శుల వివరాలతో జాబితా రూపొందించింది. ఈ మేరకు అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు మెమో జారీ చేసింది. జాబితాపై అభ్యంతరాలుంటే మెమో అందిన తేదీ నుంచి 15 రోజుల్లోగా తెలియజేయాలని పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ సూచించారు. సరైన ఆధారాలు, పత్రాలతో తమ అభ్యంతరాలను జిల్లా పంచాయతీ అధికారుల (డీపీవో) ద్వారా కమిషనరేట్‌‌‌‌‌‌‌‌కు పంపాలని ఆదేశించారు. 

జాబితాను జిల్లాల్లోని సంబంధిత గ్రేడ్‌‌‌‌‌‌‌‌-1 కార్యదర్శులందరికీ అందజేసి, అందుకున్నట్లు ధ్రువీకరణ పత్రాలను కమిషనర్‌‌‌‌‌‌‌‌ కార్యాలయానికి పంపాలని పేర్కొన్నారు. అభ్యంతరాలపై డీపీవోలు పరిశీలన చేసి, తమ రిమార్కులు, సంబంధిత రికార్డులతో కలిపి కమిషనరేట్‌‌‌‌‌‌‌‌కు పంపాల్సి ఉంటుంది. జాబితాలో ఉద్యోగి ఐడీ, పుట్టిన తేదీ, గ్రేడ్‌‌‌‌‌‌‌‌-1గా నియామకమైన తేదీ, పదవీ విరమణ తేదీ, కేటగిరీ, సబ్‌‌‌‌‌‌‌‌క్యాస్ట్‌‌‌‌‌‌‌‌, పీహెచ్‌‌‌‌‌‌‌‌సీ తదితర వివరాలను పొందుపరిచారు. పదోన్నతులు, ఇతర సర్వీసు అంశాల కోసం ఈ సీనియారిటీ జాబితా కీలకం కానుంది.