- రూ.13.03 కోట్లతో కల్యాణ మండపం, భారీ స్వాగత తోరణం
- 40 ఎకరాల్లో మోడల్ గోశాల, వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు
- రెండో మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్న ట్రస్ట్ బోర్డ్
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని భక్తుల అవసరాలకు అనుగుణంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
యాదగిరిగుట్టలోని ప్రెసిడెన్షియల్ సూట్‌లో పాలకమండలి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన ట్రస్ట్ బోర్డ్ రెండో సమావేశంలో మొత్తం 26 ప్రధాన అంశాలతో పాటు మరో 5 టేబుల్ అజెండా అంశాలకు బోర్డు సభ్యులు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు.
యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్(వైటీడీ) బోర్డ్ సహకారంతో భక్తులకు కనీస సౌకర్యాలు, సదుపాయాలతో పాటు నూతన కట్టడాల నిర్మాణమే లక్ష్యంగా పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం కొండపై విష్ణుపుష్కరిణి వద్ద సుమారు రూ.43.12కోట్లతో దీక్షాపరుల మండపం నిర్మించనున్నారు.
బాలాలయం స్థలంలో రూ.9.87 కోట్లతో నిత్య కల్యాణ మండపం, రాయిగిరి వద్ద రూ.3.16 కోట్లతో స్వాగత ఆర్చ్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఈ రెండింటినీ చైర్మన్ డాక్టర్ ఎం.సత్యనారాయణ రెడ్డి తన సొంత ఖర్చులతో నిర్మించేందుకు ముందుకొచ్చారు.
కొండకింద దేవస్థానం అద్దె గదుల సమీపంలో మహిళలు, చిన్నారుల సౌకర్యార్థం రూ.9 లక్షలతో రెండో కల్యాణకట్ట నిర్మించనున్నారు. ఈ నిర్మాణ ఖర్చులను బోర్డు మెంబర్ గుండా మల్లయ్య భరించనున్నారు. ఇక దేవస్థాన పరిసర ప్రాంతాల్లో వేద పాఠశాల, వేద విశ్వవిద్యాలయం, 40 ఎకరాల విస్తీర్ణంలో మోడల్ గోశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్నప్రసాదం స్వీకరించే భక్తుల సంఖ్యను 1,500 నుంచి 2,000 మందికి పెంచారు. భక్తుల సౌలభ్యం కోసం కొండపైన వేంచేపు మండపం పక్కన ‘డోనార్ ఎమినిటీ సెంటర్’, బస్టాండ్ ఉత్తర భాగంలో ‘పిలిగ్రిమ్ ఎమినిటీ సెంటర్’ ఏర్పాటు చేయనున్నారు. ఆలయ విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు భవనాలపై, పార్కింగ్ ప్లేస్ లో నాలుగు మెగావాట్లతో సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. విష్ణు పుష్కరిణి వద్ద కోతుల బెడద నివారణకు పాలకమండలి సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ సొంత ఖర్చులతో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించనున్నారు.
ఆలయ దక్షిణ భాగంలో భక్తులకు కనువిందు చేసేలా రూ.85 లక్షలతో ఎలక్ట్రానిక్ 'శంకు చక్ర నామాల' లైటింగ్ వ్యవస్థను ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు కొణిదెల సురేఖ ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) సహకారంతో అత్యాధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆన్లైన్ సేవలు, ప్రత్యేక ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు.
ప్రొటోకాల్ దర్శనాల్లో మార్పులు
ఆలయ వ్యవహారాలు, పాలనలో పారదర్శకత, కొనుగోళ్లలో నాణ్యత, ఆస్తుల పరిరక్షణ కోసం పాలకమండలి సభ్యులతో ప్రత్యేక సబ్ కమిటీలను నియమించారు. ప్రొటోకాల్, వీఐపీ దర్శనాల్లో ట్రస్ట్ బోర్డ్ కీలక మార్పులు సూచించింది. ప్రొటోకాల్ నిబంధనలలో పాలకమండలి స్పష్టమైన మార్గదర్శకాలను విధించింది. ఇకపై ప్రముఖులు స్వయంగా ఆలయానికి వచ్చినప్పుడు మాత్రమే ప్రోటోకాల్ దర్శనం కల్పించనున్నారు.
సిఫారసు లేఖలు, ఫోన్ సందేశాల ద్వారా వచ్చే ప్రముఖుల వాహనాలకు కొండపైకి అనుమతి ఉండదని, వారు నిర్ణీత టికెట్లు కొనుగోలు చేసి సాధారణ పద్ధతిలోనే దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యతనిస్తూ, దర్శన వ్యవస్థలో క్రమశిక్షణ, పారదర్శకత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాలకమండలి వెల్లడించింది.
