మా బిడ్డ పెళ్లికి రండి: సీఎం విజయ్‎కు షర్మిల ఆహ్వానం

మా బిడ్డ పెళ్లికి రండి: సీఎం విజయ్‎కు షర్మిల ఆహ్వానం

చెన్నై: తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్‎ను ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం (అక్టోబర్ 7) భర్త అనిల్‎తో కలిసి విజయ్‎తో భేటీ అయిన షర్మిల.. తన కూతురు అంజలి రెడ్డి వివాహానికి రావాలని ఆహ్వానించారు. వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షర్మిల ఈ విషయాన్ని వెల్లడించారు.

‘‘నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల పెళ్లి వేడుకకు కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ నా భర్త అనిల్ కుమార్‎తో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్‎కి వివాహ ఆహ్వాన పత్రికను అందించాను. మా ఆహ్వానాన్ని మన్నించి, నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు వస్తానని విజయ్ సానుకూలంగా స్పందించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని షర్మిల పేర్కొన్నారు. సీఎం విజయ్, షర్మిల భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. 

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అమెరికాలో స్థిరపడిన కర్నూలుకు చెందిన ఫేమస్ డాక్టర్ సోమాల రఘురాం రెడ్డితో 2026, నవంబర్ 25న అంజలి రెడ్డి వివాహం జరగనుంది. 2026 సెప్టెంబర్ 24న హైదరాబాద్ శివార్లలోని కొత్వాల్‌గూడలో ఇప్పటికే నిశ్చితార్థం వైభవంగా జరిగింది. 2026, డిసెంబర్ 5న రిసెప్షన్, విందు కార్యక్రమం జరగనుంది.   

డాక్టర్. సోమల రఘురామ్ రెడ్డి అనే అమెరికాలో స్థిరపడిన యువ వైద్యుడితో తన కూతురికి పెళ్లి ఫిక్స్ అయినట్లు షర్మిల ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమల సుబ్బారెడ్డి, సోమల పద్మా రెడ్డి దంపతులు కొన్నేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. వీళ్ల కొడుకే డాక్టర్. సోమల రఘురామ్ రెడ్డి. ఈ కుటుంబానికి అమెరికా పౌరసత్వం ఉంది. ఈ కుటుంబం ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడింది.