హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యా, పరిపాలన, మౌలిక వసతుల అంశాలపై ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ DIEOలు, ప్రిన్సిపాళ్లతో సమీక్ష నిర్వహించారు. కాలేజీల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
కొత్త సిలబస్, ప్రాక్టికల్ పరీక్షలపై ఆదేశాలు
2026–27 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం విద్యార్థులకు అమలు చేయనున్న కొత్త సిలబస్, సవరించిన ప్రాక్టికల్ పరీక్షల విధానం, వ్యాలిడేషన్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనలను ముందుగానే వారికి అవగాహన కల్పించాలని సూచించారు.
విద్యార్థుల హాజరును సమర్థంగా పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు వివరాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు.విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో RO తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సౌకర్యాల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
మధ్యాహ్న భోజనం, బ్రేక్‌ఫాస్ట్‌పై సమీక్ష
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం, బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాలపై కూడా సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల వినియోగంపై సమగ్ర శిక్షా నిధులను ఉపయోగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇంటర్ విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో కొనసాగుతున్న 15 రోజుల ‘తెలంగాణ ఇన్నోవేషన్ హ్యాకథాన్’ పురోగతిని కూడా ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ సమీక్షించారు. విద్యార్థులు చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాలని, కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు కాలేజీల్లో మౌలిక వసతులు, పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం అయ్యేలా సమన్వయంతో పనిచేయాలని DIEOలు, ప్రిన్సిపాళ్లకు సూచించారు.
