ఏకకాలంలో 27 లక్షల మందికి అల్పాహారం..మునగాలలో గ్రీన్ఫీడ్ కిచెన్ను నిర్మాణం

ఏకకాలంలో 27 లక్షల మందికి అల్పాహారం..మునగాలలో గ్రీన్ఫీడ్ కిచెన్ను నిర్మాణం
  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  • మంత్రి ఉత్తమ్​ తో కలిసి సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్​కు శంకుస్థాపన
  • పులిచింతల జలవిద్యుత్​ కేంద్రాన్ని సందర్శించిన మంత్రులు
  • త్వరలో ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ స్కీం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటన

సూర్యాపేట/మునగాల/గరిడేపల్లి/మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు : రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఏకకాలంలో వేడివేడి అల్పాహారం అందించే కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదని, తెలంగాణలోనే ఈ వినూత్న పథకాన్ని అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం ఉచితం కాదని, అది రాష్ట్ర భవిష్యత్​మానవ వనరులపై చేస్తున్న పెట్టుబడి అని పేర్కొన్నారు. 

మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని మునగాలలో పాఠశాలల విద్యార్థుల కోసం రూ.9.6 కోట్లతో నిర్మించనున్న సెంట్రలైజ్డ్​ కమ్యూనిటీ కిచెన్​కు మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ 1020 పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 60 వేల మంది విద్యార్థులకు ఒకే కిచెన్​నుంచి వేడివేడి అల్పాహారం అందించేందుకు మునగాలలో గ్రీన్​ఫీడ్​ కిచెన్​ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

 రైతు భరోసా, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ  వంటి కార్యక్రమాలన్నింటి అంతిమ లక్ష్యం పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదగడమేనన్నారు. రాష్ట్రాన్ని పదేండ్ల పాటు దాచుకొని, దోచుకుని తిన్నది బీఆర్ఎస్​ నేతలేనని, ఇక ఆ పార్టీకి  గతం తప్ప భవిష్యత్ లేదని ఎద్దేవా చేశారు. 

నవంబర్​లో ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ భద్రత కల్పించే లక్ష్యంతో నవంబర్​లో ఇందిరమ్మ జయంతి సందర్భంగా ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ పథకాన్ని తీసుకురానున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. కుటుంబ యజమానికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భద్రత కల్పించేలా ఈ స్కీం రూపొందిస్తున్నట్లు చెప్పారు.

‎8 వేల మెగావాట్ల అదనపు భారం..

చింతలపాలెం మండలంలోని ‎పులిచింతల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మంత్రి ఉత్తమ్​తో కలిసి భట్టి విక్రమార్క పరిశీలించారు. గతంలో ఇదే సమయంలో రాష్ట్ర విద్యుత్ పీక్ డిమాండ్ 15 వేల మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం 20 వేల మెగావాట్లకు చేరిందని భట్టి తెలిపారు. ఎల్ నినో ప్రభావం వల్ల నదులు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గడంతో జలవిద్యుత్ ఉత్పత్తి సుమారు 4 వేల మెగావాట్లు తగ్గిందని చెప్పారు. దీంతో 8 వేల మెగావాట్ల అదనపు భారం ఏర్పడినప్పటికీ ఆ సంస్థలు నిరంతర విద్యుత్ సరఫరా  చేస్తున్నాయన్నారు. ఈసారి తాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. 

సింగరేణి కార్మికుల సమస్యలపై సమీక్ష

సింగరేణి బొగ్గు గని కార్మికులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సుదీర్ఘకాల సమస్యల పరిష్కారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టి సారించారు. మంగళవారం ప్రజాభవన్​లో సింగరేణి ప్రాంత మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకట స్వామి, ఎమ్మెల్యేలు  ప్రేమ్ సాగర్ రావు, డాక్టర్ మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాలోతు రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు,  కూనంనేని సాంబశివరావు, గండ్ర సత్యనారాయణ రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, గడ్డం వినోద్ వెంకటస్వామి, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ సంస్థ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 

భట్టి విక్రమార్క మాట్లాడుతూ పెండింగ్​లోని సుమారు 250 నుంచి 300 వరకు ఉన్న డిపెండెంట్ ఆర్డర్లను, ఇతర లీగల్ ప్రాసెస్లను రాబోయే 15 రోజుల్లో పూర్తి చేసి అభ్యర్థులకు అందజేయాలని ఆదేశించారు. కరోనా సమయంలో లేదా ఇతర కారణాల వల్ల విధులకు హాజరుకాక ఉద్యోగాల నుంచి తొలగించిన కార్మికుల విషయంలో వన్ టైం ఆప్షన్ కింద తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. 

రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించిన భూముల్లో మిగిలి ఉన్న 1250 ఎకరాల్లో జీవో నెంబర్ 76 ప్రకారంగా అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని స్పీడప్​ చేయాలన్నారు. సింగరేణి పరిధిలోని పాత జిల్లాల్లో ప్రతి గ్రామానికి వెళ్లి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతరం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లిలో నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ స్కూల్ పనులను వారు పరిశీలించారు.