గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం: సర్వోత్తమ్‌రెడ్డి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం: సర్వోత్తమ్‌రెడ్డి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించేందుకు కృషి చేస్తామని నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి  తెలిపారు. కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసే అవకాశం రావడం తనకు అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ..  తమ కుటుంబం నాలుగు తరాలుగా కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవ చేస్తోందని సర్వోత్తమ్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేటలో 35 మంది కౌన్సిలర్లు, 80 మంది సర్పంచులను గెలిపించిన చరిత్ర తమ కుటుంబానికి ఉందని పేర్కొన్నారు. అధికారం కంటే ప్రజల పట్ల బాధ్యత, అభిమానం తమ కుటుంబ వారసత్వమని అన్నారు.

రాబోయే ఎన్నికల నాటికి 36 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రతి ఒక్కరినీ నేరుగా కలుస్తానని సర్వోత్తమ్‌రెడ్డి తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త ఓటర్ల నమోదు అత్యంత కీలకమని పేర్కొన్నారు. పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ALSO READ : గురుకులంలో ఎలుకల కలకలం..

తన విద్య, వృత్తి నేపథ్యాన్ని కూడా సర్వోత్తమ్‌రెడ్డి వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడంతో పాటు విదేశాల్లో డ్యూయల్ మాస్టర్స్ పూర్తి చేశానని, ‘క్యాపిటల్ వన్’ సంస్థలో పదేళ్ల పాటు పనిచేశానని తెలిపారు.

సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు, నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల సన్నద్ధతపై చర్చించినట్లు తెలిపారు.