- టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి
యాదగిరిగుట్ట, వెలుగు : ఆర్టీసీ కార్మికుల చిరకాల ఆకాంక్ష అయిన ‘ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం’ ప్రక్రియను వందశాతం పూర్తి చేయిస్తామని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట డిపోను ఆయన సందర్శించారు.
ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఎన్నికలకు మరో మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉందని, కార్మికులంతా ఐక్యంగా తమ మద్దతుదారులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దాదాపు దశాబ్ద కాలంగా ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు లేకుండా చేసి కార్మికుల హక్కులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాసిందని, అందుకే కార్మికులు, ప్రజలు ఏకమై ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల సంక్షేమానికి చర్యలు ప్రారంభమయ్యాయని, ఇప్పటికే రెండు వేతన సవరణలు జరిగాయని, పీఎఫ్ బకాయిల చెల్లింపుతో పాటు పెండింగ్ డీఏలను కూడా ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తుచేశారు.
సమ్మె కాలంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో దాదాపు 36 మంది కార్మికులు బలిదానాలు చేశారని, వారి త్యాగాలను స్మరిస్తూ ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం విలీన ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో టీఎంయూ, టీడబ్ల్యూయూ కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటేసి సంపూర్ణ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
