అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువులకు కొత్త రూల్స్.. స్క్రీనింగ్ టెస్ట్ లేదు.. అకడమిక్సే కీలకం 

అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువులకు కొత్త రూల్స్.. స్క్రీనింగ్ టెస్ట్ లేదు.. అకడమిక్సే కీలకం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌‌మెంట్ రూల్స్‌‌లో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. గతేడాది తీసుకొచ్చిన జీవో21కి సవరణలు చేస్తూ, సమగ్రమైన కొత్త మార్గదర్శకాలతో మరో ఉత్తర్వు ఇచ్చేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది. రిక్రూట్‌‌మెంట్‌‌లో ఎలాంటి రాతపరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) నిర్వహించకూడదని నిర్ణయించిన సర్కారు.. అభ్యర్థుల అకడమిక్ మెరిట్‌‌కే పెద్దపీట వేయాలని డిసైడ్ అయింది. 2018 నాటి యూజీసీ రెగ్యులేషన్స్‌‌లోని టేబుల్–3 నిబంధనలను రాష్ట్ర నియామకాల్లో ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయనున్నారు. పాత నిబంధనల్లో తలెత్తిన లోపాలను సరిదిద్ది, ఏ దశలోనూ మార్కుల డూప్లికేషన్‌‌కు ఆస్కారం లేకుండా మూడు దశల్లో పారదర్శకంగా ఎంపిక ప్రక్రియను 
చేపట్టనున్నారు. 

యూజీసీ స్కోరు సగానికి కుదింపు

మొత్తం100 మార్కులకుగాను మూడు దశల్లో (పార్ట్ ఏ, బీ, సీ) రిక్రూట్‌‌మెంట్ ప్రక్రియ కొనసాగనుంది. ఇందులో మొదటి దశ అయిన ‘పార్ట్– ఏ’ (అకడమిక్ రికార్డు అండ్ రీసెర్చ్ పెర్ఫార్మెన్స్)ను గరిష్టంగా 50 మార్కులకు ఖరారు చేశారు. 2018 యూజీసీ నిబంధనల ప్రకారం టేబుల్–3లో అకడమిక్స్, రీసెర్చ్‌‌కు మొత్తం 100 మార్కులు కేటాయించగా, మన రాష్ట్ర రిక్రూట్‌‌మెంట్‌‌లో దాన్ని దామాషా పద్ధతిలో 50 మార్కులకు కుదిస్తారు. 

ఉదాహరణకు యూజీసీ నిబంధనల్లో పీహెచ్‌‌డీకి 30 మార్కులు ఉంటే, ఇక్కడ దానికి15 మార్కులే ఇస్తారు. గ్రాడ్యుయేషన్, పీజీ, నెట్, జేఆర్‌‌ఎఫ్, రీసెర్చ్ పబ్లికేషన్స్ మార్కులన్నీ కూడా ఇదే దామాషాలో సగానికి తగ్గుతాయి. ఈ 50 మార్కుల్లో సాధించిన మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం పోస్టుకు 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను తర్వాతి దశకు ఎంపిక చేస్తారు. 

మార్కుల డూప్లికేషన్‌‌కు చెక్

గతంలో ఇచ్చిన జీవో– 21లో పార్ట్–ఏలో లెక్కించిన అర్హతలే మళ్లీ పార్ట్–బీలోనూ చేర్చడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్ట్–ఏలో పరిగణనలోకి తీసుకున్న డిగ్రీ, పీజీ, పీహెచ్‌‌డీ, పరిశోధనా పత్రాల వంటి అంశాలు మళ్లీ పార్ట్–బీ, పార్ట్–సీలలో ఎక్కడా పునరావృతం కాకుండా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

స్క్రూటినీ బాధ్యత కౌన్సిల్‌‌కు 

ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా బాధ్యతలను విడదీశారు. ఖాళీల వారీగా యూనివర్సిటీల వారిగా దరఖాస్తులను స్వీకరించనున్నారు. వాటి స్క్రూటినీ బాధ్యతను తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(టీజీసీహెచ్‌‌ఈ) చేపట్టనుంది. అభ్యర్థుల డాక్యుమెంట్లు, విద్యార్హతలను కౌన్సిల్ నిశితంగా పరిశీలించి, పార్ట్–ఏ మార్కుల మెరిట్ ఆధారంగా 1:10 నిష్పత్తిలో అభ్యర్థుల షార్ట్‌‌లిస్ట్‌‌ను సిద్ధం చేస్తుంది. దీన్ని 1: 12 చేయాలనే చర్చ కూడా నడుస్తోంది. ఆ జాబితాను సంబంధిత యూనివర్సిటీలకు పంపిస్తుంది.  

డెమో, ఇంటర్వ్యూలు వర్సిటీలకే..  

టీజీసీహెచ్‌‌ఈ నుంచి 1:10 లిస్ట్ అందిన తర్వాత మిగతా రెండు దశల ఎంపికను ఆయా యూనివర్సిటీలు నిర్వహిస్తాయి. ఇందులో భాగంగా పార్ట్– బీ (డొమైన్ నాలెడ్జ్, టీచింగ్ స్కిల్స్)కు కేటాయించిన 30 మార్కులకు గాను వర్సిటీ స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో డెమో లెక్చర్ నిర్వహించి అభ్యర్థుల బోధనా సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా పోస్టుకు 1:5 నిష్పత్తిలో తుది ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. 

చివరి దశ అయిన పార్ట్– సీ (ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ – 20 మార్కులు)ను వైస్ చాన్సలర్ (వీసీ) నేతృత్వంలోని వర్సిటీ సెలక్షన్ కమిటీ పూర్తి చేస్తుంది. చివరగా పార్ట్ ఏ (50) + బీ (30) + సీ (20) కలిపి మొత్తం 100 మార్కులకు వచ్చిన ఓవరాల్ మెరిట్, రోస్టర్ విధానాన్ని అనుసరించి తుది ఎంపిక జాబితాను ఖరారు చేస్తారు. త్వరలోనే ఈ సవరించిన నిబంధనలతో ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేయనుంది.