ఈ దొంగ చేసిన పని కాస్త నవ్వు తెప్పిస్తుంటుంది.. వీడి అమాయకత్వానికి కాస్త జాలి వేస్తుంది కూడాను. ఎందుకంటే ఐఫోన్ దొంగిలించి.. పాస్ వర్డ్ పంపమని మెసేజ్ చేయడం చూస్తే నవ్వురాకుండా ఉంటుందా. ఉత్తరాఖండ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డెహ్రాడూన్‌లో ఒక యువతి ఐఫోన్ దొంగిలించిన నెల తర్వాత, ఆ దొంగే ఆమెను సంప్రదించి పాస్‌వర్డ్ అడిగిన విచిత్ర ఘటన ఇది.
క్లెమెంట్ టౌన్‌లో 2026 సెప్టెంబర్ 12న కౌశికి ధ్యాని (ఇన్‌స్టాగ్రామ్: Kaushiki_28) ఐఫోన్ పోయింది. ఆమె ఫోన్ ఒక్కటే కాదు.. ఆమె ఫ్రెండ్ సోదరుడు సక్షమ్ నేగి ఫోన్ సహా అనేక మంది ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, మ్యాక్‌బుక్‌లు ఎత్తుకెళ్లారు దొంగలు. ఈ దొంగతనాల్లో లక్షల రూపాయల విలువైన వస్తువులు కోల్పోయినట్లు ఆమె తెలిపింది.
కౌషికి ఉండే భవనం నుంచి 5-6 ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పోయాయి. సమీపంలోని పీజీలు, హాస్టళ్లపై కూడా అదే రోజు దొంగతనాలు జరిగాయి. ఉదయం 4 నుంచి 8 గంటల మధ్య ఈ దొంగతనాలు జరిగాయని, ఆమె ఫ్లాట్ లాస్ట్ టార్గెట్ అని తెలిపింది. ఆ తర్వాత కూడా అదే ప్రాంతంలో మరో 16 దొంగతనాలు జరిగినట్లు ఆమె చెప్పింది.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే.. ఫోన్ ఎత్తుకెళ్లిన తర్వాత దొంగ ఆమెను ఎస్‌ఎమ్‌ఎస్, వాట్సాప్ ద్వారా సంప్రదించి ఐఫోన్ పాస్‌వర్డ్ అడిగాడు. ఫోన్‌లో ఒక నంబర్ కనిపిస్తుండడంతో దొంగ ఆమెను అప్రోచ్ అయినట్లు చెప్పింది. ఈ చాట్ కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను పోలీసులకు ఇచ్చినా సరైన చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించింది.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు ఎవరూ లేరు, తర్వాత రండి అని చెప్పారని, దొంగలు ఇప్పుడు పోలీసులంటే భయపడటం లేదని ఆమె పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ పోలీసులు వాళ్లను పట్టుకోలేరని, హాని చేయలేరని దొంగలకు తెలుసు అని ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
మరోవైపు, అమన్‌దీప్ నేగి అనే వ్యక్తి కూడా సెప్టెంబర్ 16న క్లెమెంట్ టౌన్‌లో కుశాగ్ర జైస్వాల్‌కు సంబంధించిన లక్షల రూపాయల విలువైన వస్తువుల దొంగతనం గురించి ఇలాంటి వీడియో షేర్ చేశారు.
అయితే పోలీసులు ఈ ఆరోపణను తోసిపుచ్చారు. సిటీ ఎస్‌పీ శేఖర్ సుయాల్ పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోలేదని కాదు. సర్కిల్ ఆఫీసర్ దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పారు.
