హైదరాబాద్: పబ్లిక్ రోడ్లపై ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ముగ్గురు యువకులను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం వ్యూస్, లైక్స్ కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేయడంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు.
అత్తాపూర్ పిల్లర్ నంబర్ 257, ఫ్లిప్‌కార్ట్ గోడౌన్ సమీపంలోని పబ్లిక్ రోడ్డుపై ముగ్గురు యువకులు నంబర్ ప్లేట్లు లేని మూడు హోండా డియో ద్విచక్ర వాహనాలతో అత్యంత వేగంగా ప్రయాణిస్తూ ప్రమాదకరమైన స్టంట్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్టంట్స్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. వీడియోలు పోలీసుల దృష్టికి రావడంతో అత్తాపూర్ పోలీసులు వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
వీడియోల్లో కనిపించిన యువకులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 24 ఏళ్ల మహమ్మద్ మోహినుద్దీన్ అలియాస్ మోహిన్, 21 ఏళ్ల మహమ్మద్ రిజ్వాన్, 19 ఏళ్ల తొహిద్ ఉన్నారు.పబ్లిక్ రోడ్లపై ఇలాంటి ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేయడం వల్ల స్టంట్స్ చేస్తున్న యువకుల ప్రాణాలకే కాకుండా రోడ్డుపై ప్రయాణించే ఇతర వాహనదారులు, పాదచారుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని పోలీసులు హెచ్చరించారు.
మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం ప్రమాదకరమైన రీల్స్ చేయడం మానుకోవాలని యువతకు పోలీసులు సూచించారు.
అత్తాపూర్, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పరిసరాల్లో రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, స్పీడ్ రేసింగ్, బైక్ స్టంట్స్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అత్తాపూర్ పోలీసులు స్పష్టం చేశారు.పబ్లిక్ రోడ్లను స్టంట్స్ కోసం ఉపయోగిస్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.
