ఉత్తర ప్రదేశ్‌లోని ఈటా (Etah) జిల్లాలో ట్రిపుల్ తలాక్ వివాదం వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నంగా కారు తేలేదని కోపంతో ఒక వ్యక్తి, తన భార్యకు నడి రోడ్డు పైనే ‘ట్రిపుల్ తలాక్’ చెప్పి వదిలేసి వెళ్లిపోయాడు. బాధితురాలి ఆరోపణల ప్రకారం భర్త, అతని కుటుంబికులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అదనపు కట్నం వేధింపులు:
ఈటా రేవారి మొహల్లాకు చెందిన సుభాన్ సైఫీ కుమార్తె మంతషా (28)కి, అలీగఢ్‌కు చెందిన షరీక్ సైఫీతో 2025 డిసెంబర్ 3న వివాహం జరిగింది. షరీక్ ఢిల్లీలో ఏసీ రిపేర్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి సమయంలో సుభాన్ తన స్థోమతకు మించి రూ.5 లక్షల నగదుతో పాటు ఏసీ, ఫ్రిజ్, బంగారు-వెండి ఆభరణాలు కట్నంగా ఇచ్చాడు. అయితే, పెళ్లయిన వెంటనే అదనపు కట్నంగా 'కారు' కావాలని అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు.
రోడ్డుపై వదిలేసి ట్రిపుల్ తలాక్:
పెళ్లయిన రెండున్నర నెలల తర్వాత (ఫిబ్రవరి 15న), షరీక్ ఇంకా అతని బంధువులు మంతషాను అలీగఢ్ నుండి ఈటాకు తీసుకువచ్చారు. అక్కడ 'అలీ మహమ్మద్ చౌక్' వద్ద ఆమెను వాహనం నుండి కిందకు దించేసి, భర్త షరీక్ అందరి ముందే "తలాక్, తలాక్, తలాక్" అని మూడుసార్లు చెప్పి ఆమెను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు.
ట్రాన్స్‌జెండర్‌తో రెండో పెళ్లి:
ఢిల్లీలో పనిచేస్తున్న సమయంలో షరీక్‌కు కోమల్ అనే ట్రాన్స్‌జెండర్‌తో పరిచయం ఏర్పడిందని, ఆమె సలహా మేరకే అతను తనను వదిలించుకోవడానికి ఇలా చేశాడని మంతషా ఆరోపించింది. అంతేకాకుండా, పంచాయతీల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి తమ కుటుంబం ఎంత ప్రయత్నించినా వినకుండా, షరీక్ మరో వివాహం చేసుకున్నాడని తెలుసుకొని ఆమె పోలీసులను ఆశ్రయించింది.
కుటుంబికుల ఆవేదన:
కూతురి పెళ్లి కోసం బ్యాంకు లోన్ తీసుకోవడంతో పాటు బంధువుల దగ్గర కూడా అప్పులు చేశానని, ఆ అప్పులు ఇంకా తీరుస్తూనే ఉన్నానని మంతషా తండ్రి సుభాన్ ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి సమయం నుండి అత్తమామలు తమను తీవ్రంగా అవమానించారని, వివాహాన్ని రక్షించుకోవడానికి చేసిన పంచాయతీ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని చెప్పారు.
పోలీసుల చర్యలు
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈటాలోని కోత్వాలి నగర్ పోలీసులు భర్త షరీక్‌తో పాటు మొత్తం ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. షరీక్‌కు ట్రాన్స్‌జెండర్‌తో ఉన్న సంబంధం, అతని రెండో పెళ్లి ఆరోపణలపై పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
