సింక్‌‌ఫీల్డ్‌‌ కప్‌‌లో ప్రజ్ఞానందకు రెండో విజయం

సింక్‌‌ఫీల్డ్‌‌ కప్‌‌లో ప్రజ్ఞానందకు రెండో విజయం

సెయింట్‌‌ లూయిస్‌‌ (అమెరికా): ఇండియా గ్రాండ్‌‌ మాస్టర్‌‌ ఆర్‌‌. ప్రజ్ఞానంద.. సింక్‌‌ఫీల్డ్‌‌ కప్‌‌లో మళ్లీ పుంజుకున్నాడు. శుక్రవారం జోర్డెన్‌‌ వాన్‌‌ ఫోరెస్ట్‌‌ (నెదర్లాండ్స్‌‌)తో జరిగిన నాలుగో రౌండ్‌‌ గేమ్‌‌లో ప్రజ్ఞా 71 ఎత్తుల వద్ద విజయం సాధించాడు. ఫలితంగా రెండున్నర పాయింట్లతో సంయుక్తంగా రెండో ప్లేస్‌‌లో కొనసాగుతున్నాడు. గేమ్‌‌ ఆరంభం నుంచే వ్యూహాత్మకంగా ఆడిన ప్రజ్ఞానంద 12వ ఎత్తు వద్ద కీలక మలుపు తీసుకున్నాడు. 

ఫోరెస్ట్‌‌ తన క్వీన్‌‌ను చేజార్చుకోవడంతో గేమ్‌‌పై పట్టు కోల్పోయాడు. లెవోన్‌‌ అరోనియన్‌‌ (అమెరికా, 2.5)తో జరిగిన గేమ్‌‌ను డ్రా చేసుకున్న వెస్లీ సో (అమెరికా) మూడు పాయింట్లతో టాప్‌‌ ప్లేస్‌‌లో ఉన్నాడు. మాక్సిమ్‌‌ వాచిర్‌‌ లాగ్రెవ్‌‌ (ఫ్రాన్స్‌‌, 2.5).. విన్సెంట్‌‌ కీమర్‌‌ (జర్మనీ, 2), అనిష్‌‌ గిరి (నెదర్లాండ్స్‌‌, 1.5).. జావోఖిర్‌‌ సిందరోవ్‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌, 1.5), సావియన్‌‌ శామ్యూల్స్‌‌ (అమెరికా, 2).. ఫ్యాబియానో కరువాన (అమెరికా, 2) మధ్య జరిగిన గేమ్‌‌లు డ్రా అయ్యాయి. ఈ టోర్నీలో మరో ఐదు రౌండ్లు మిగిలి ఉన్నాయి.